‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకుంది నందితా శ్వేత. తర్వాత గ్లామర్ రోల్స్‌తో పాటు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించింది. ‘అక్షర’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ ఫిమేల్ లీడ్‌గా ఆకట్టుకుంది. తాజాగా మరో కొత్త ప్రయోగంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది నందిత. ఇటీవల సింగిల్ క్యారెక్టర్ మూవీస్‌కి సౌత్‌లో కూడా ఆదరణ దక్కుతోంది. అలాంటి సింగిల్ క్యారెక్టర్ సినిమాలో నటిస్తోంది నందిత. శ్రీ విజయానంద్ పిక్చర్స్ బ్యానర్‌పై కొత్త దర్శకుడు సత్యవెంకట్ రూపొందిస్తున్న చిత్రం ‘రారా.. పెనిమిటి’. ప్రమీల నిర్మిస్తున్నారు. మొత్తం సినిమాలో ఒకే ఒక్క పాత్రగా కనిపించే నందితా శ్వేత పర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంటుందన్నారు మేకర్స్.
తెరమీద కనిపించకుండా కేవలం డైలాగుల రూపంలో బ్రహ్మానందం, నాగబాబు, తనికెళ్ళ భరణి, సునీల్, తాగుబోతు రమేష్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణ, శివపార్వతి వినిపించే పాత్రలు పోషించారు. కనిపించని హీరో పాత్రకు శివబాలాజీ గాత్రానిచ్చాడు. మణిశర్మ ఈ చిత్రానికి ఐదు పాటలను అందించారు. టీజర్, ట్రైలర్లను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేయగా, ఫస్ట్ లిరికల్ వీడియోను చిత్ర సంగీత దర్శకుడితో పాటు నందితా శ్వేత విడుదల చేసింది. మరోవైపు నందిత నటించిన ‘ఎస్5’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.