Hi Nanna Movie Review: భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కథ.. నాని మరో హాట్ పడినట్టేనా?

Hi Nanna Movie Review: భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కథ.. నాని మరో హాట్ పడినట్టేనా?

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna). సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్(Shouryuv) తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు. ఫాథర్ అండ్ డాటర్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వైట్ చేస్తున్నారు. ఈ సినిమా నేడు(డిసెంబర్ 7) థియేటర్స్ లోకి వచ్చింది. మరి హాయ్ నాన్న సినిమా ఎలా ఉంది? నాని ఏమేరకు మెప్పించాడు? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
విరాజ్‌(నాని) ఓ ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌. అతని కూతురు మహి(బేబీ కియారా ఖన్నా). కూతురంటే విరాజ్ కు ప్రాణం కానీ.. మహి చిన్నప్పటి నుండి అరుదైన వ్యాధితో బాధపడుతుంది. అందుకే కూతురుకి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్త చూసుకుంటూ ఉంటాడు. అంతేకాదు.. ప్రతి రోజు రాత్రి కూతురు మహికి కథలు చెప్తూ ఉంటాడు విరాజ్‌. ఆ కథల్లో హీరో పాత్రని నాన్నతో పోల్చుకుంటూ ఉంటుంది మహి. అలా ఒకరోజు తన అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. దానికి విరాజ్.. నువ్వు క్లాస్‌ ఫస్ట్‌ వస్తే చెప్తానని ప్రామిస్‌ చేస్తాడు. అమ్మ కథ కోసం చాలా కష్టపడి క్లాస్‌ ఫస్ట్‌ మహి. ప్రామిస్ చేసిన ప్రకారం మహికి విరాజ్ అమ్మకథ చెప్తాడా? ఈ ఇద్దరి మధ్యలోకి యష్ణ(మృణాల్ ఠాకుర్) ఎలా వచ్చింది? ఇంతకీ విరాజ్ లవ్ స్టోరీ ఏంటి?  విరాజ్‌ మహికి సింగిల్‌ పేరెంట్‌గా ఎందుకు ఉండాల్సి వచ్చింది? అరుదైన వ్యాధిని మహి జయించిందా? లేదా? అనేది  మిగిలిన కథ.

విశ్లేషణ:
ఒక తండ్రి తన కూతురికి అమ్మ గురించి చెప్పే గొప్ప ప్రేమ కథ ఇది. ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. ముందు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, తరువాత గొడవపడి విడిపోవడం, చివరకు అర్థంచేసుకొని కలిసిపోవడం. ఈ తరహా కథలు గతంలో చాలానే వచ్చాయి. మరి హాయ్‌ నాన్నలో ఉన్న ఆ స్పెషాలిటీ ఏంటంటే? ఒక సింపుల్ ప్రేమ కథను అమ్మ కథకు లింక్ చేసి.. నడిపించిన చాలా తీరు కొత్తగా ఉంది. ఆ నేపధ్యంలో ప్రధాన పాత్రల మధ్య ఏర్పడే  మానసిక సంఘర్షణ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది.

తండ్రి కూతుళ్ల ఎమోషనల్ బాండింగ్ తో మొదలైన ఈ కథ.. మహి తన తల్లిగా యష్ణని ఊహించుకోవడం నుండి మలుపు తిరుగుతుంది. ఆ ప్రేమకథలో విరాజ్‌, వర్షల పరిచయం, ప్రేమ, పెళ్లి నేపధ్యం లో వచ్చే సీన్స్ క్యూట్ గా ఉంటాయి. ఆతరువాత వచ్చే ట్విస్ట్‌ తో ఆడియన్స్ గుండె బరువెక్కుతుంది. దాంతో సెకండ్ హాల్ఫ్ పై ఆసక్తి పెరుగుతుంది.

ఇక సెకండాఫ్‌ మరింత ఎమోషనల్ గా సాగుతుంది. కొన్ని చోట్ల సాగదీతగా అనిపించినా.. అప్పటికే సినిమాతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు ఆడియన్స్. డైలాగ్స్ కూడా ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. ఇక సినిమా క్లైమాక్స్‌లో జయరామ్‌ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ కూడా ఆకట్టుకుంటుంది.

నటీనటులు:
హీరో నాని గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సహజమైన నటనతో ఇప్పటికే నేచురల్ స్టార్ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు. ఆ ట్యాగ్ కు పర్ఫెక్ట్ సింక్ అయ్యేలా హాయ్ నాన్నలో విరాజ్ పాత్రలో ఒదిగిపోయాడు నాని. తండ్రిగా, ప్రియుడిగా, భర్తగా.. చాలా వేరియేషన్స్‌ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించారు. కూతురితో ఆయన పలికించిన భావోద్వేగాలు సినిమాకు హైలెట్‌ గా నిలిచాయి. ఇక మృణాల్‌ ఠాకూర్‌ కూడా తనడైన నటనతో మెస్మరాజ్ చేశారు. యష్ణగా, వర్షగా రెండూ పాత్రల్లోనూ ఒదిగిపోయారు. ఇక హాయ్ నాన్న సినిమాలో ముఖ్యం చెప్పుకోవాల్సింది మహి పాత్ర చేసిన చిన్నారి కియార ఖన్నా గురించి. తెరపై క్యూట్ గా కనిపిస్తూ..  తనదైన నటనతో ఏడిపించేసింది. ఇక నటుడు జయరాం, కమెడియన్ ప్రియదర్శి తమ పాత్రల మేరకు మెప్పించారు.

సాంకేతికవర్గం:
హాయ్ నాన్న గురించి మాట్లాడాలంటే ముందు హేషమ్ అబ్దుల్ వహాబ్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఈ సినిమాకు అందించిన పాటలు, మెయిన్ గా నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేశాయి. వర్గీస్‌ సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా ఉంది. ఎడిటర్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

ఇక మొత్తంగా చెప్పాలంటే.. భావోద్వేగాలతో కన్నీళ్లు పెట్టించే అందమైన తండ్రీకూతుళ్ల కథ. మధ్యలో అద్భుతమైన ప్రేమ కథ.