హిట్ 3 టీజర్ రిలీజ్.. వైల్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని ఊచకోత

హిట్ 3 టీజర్ రిలీజ్..  వైల్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని ఊచకోత

నేచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా హిట్ 3 మూవీ టీమ్ నాని అభిమానులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. నాని పుట్టిన రోజు పురస్కరించుకుని శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హిట్ 3 సినిమా టీజర్‎ను విడుదల చేసింది మూవీ యూనిట్. ఒక నిమిషం 44 సెకన్లతో టీజర్ కట్ చేసిన మేకర్స్.. ఇందులో నానిని వైల్డ్‎గా చూపించారు. అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని విశ్వరూపం చూపించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. టీజర్ ఆసాంతం వైల్డ్ పోలీస్‎ అధికారి క్యారెక్టర్‎లో నాని రెచ్చిపోయాడు. టీజర్ ప్రారంభంలోనే నాని గురించి రావు రమేష్ ఇచ్చిన హైప్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేసింది. 

‘‘ఫ‌స్ట్ డే నిన్ను చూసిన‌ప్పుడే డౌట్ వ‌చ్చింది.. నువ్వు పోలీస్ ఆఫీస‌ర్‌వేనా అని ఓ అమ్మాయి అన‌గానే.. అదే అనుకొని ఇన్నేళ్లు జ‌నం మోస‌పోయారు. మీకు ఒరిజిన‌ల్ చూపిస్తా’’ అంటూ నాని చెప్పిన డైలాగ్ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. తాజా టీజర్ హిట్ 3పై అంచనాలను మరింత పెంచేసింది. హిట్ సిరీస్‎కు హీరో నానినే నిర్మాతగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. హిట్ 1లో విశ్వక్ సేన్, హిట్ 2లో అడివి శేషు ప్రధాన పాత్రల్లో నటించారు. క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటింగ్ నేపథ్యంలో సాగే హిట్ సిరీస్‎లోని రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‎గా నిలిచాయి. ఇక, హిట్ 3లో నాని నటిస్తుండటంతో ఈ సినిమా మరింత హైప్ క్రియేట్ అయ్యింది. 

తాజాగా విడుదలైన టీజర్ అంచనాలను వేరే లెవల్‎కు తీసుకెళ్లిందంటున్నారు నాని ఫ్యాన్స్. హిట్ 3 మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించగా.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. 'కేజీఎఫ్' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి నాని సరసన హీరోయిన్‎గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న హిట్ 3 మూవీ..  మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.