Saripodhaa Sanivaaram Review: సరిపోదా శనివారం మూవీ రివ్యూ..నాని మాస్ యాక్ష‌న్ డ్రామా ఎలా ఉందంటే?

Saripodhaa Sanivaaram Review: సరిపోదా శనివారం మూవీ రివ్యూ..నాని మాస్ యాక్ష‌న్ డ్రామా ఎలా ఉందంటే?

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియాంక మొహనన్ (Priyanka Mohanan) హీరోయిన్ గా నటించింది. డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మించిన ఈ సినిమా తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గురువారం (ఆగస్ట్ 29న) థియేటర్లలలో రిలీజైంది.టీజర్, ట్రైలర్ వంటి విజువల్స్ తో  అంచనాలు పెంచేసిన సరిపోదా శనివారం..మరి ఆ అంచనాలను ఏ మేర అందుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం పదండి.

Also Read:-జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌పై..స్పందించిన నటి ఖుష్బూ

కథేంటంటే:

సోకులాపురం గ్రామానికి చెందిన సూర్య (నాని)కి చిన్నతనం నుంచే కోపం ఎక్కువ. సూర్య చిన్నప్పుడే తల్లి (అభిరామి)ని క్యాన్సర్ కారణంగా కోల్పోతాడు. అయితే తల్లి చనిపోయే ముందే సూర్యకి తనలో ఉన్న ఆవేశాన్ని తగ్గించేందుకు వారంలో ఒక్కరోజు మాత్రమే ఆ కోపాన్ని ప్రదర్శించాలని మాట తీసుకుంటుంది. ఆ ప్రకారం అతను వారంలో మిగతా రోజులు ఎవరి మీద కోపం వచ్చినా దాచుకుని.. ఒక్క శనివారం మాత్రం ఆ కోపాన్ని తీర్చుకోవడం అలవాటు చేసుకుంటాడు. ఈ క్రమంలో తప్పులు చేసిన చాలామందికి శనివారాల్లో బుద్ధి చెబుతుంటాడు. ఇలాంటి సమయంలోనే సూర్యకు ఒక గొడవలో చారులత(ప్రియాంక మోహన్) పరిచయమవుతుంది. మొదటి చూపులోనే ఆమె మీద ఇష్టం ఏర్పడుతుంది. ఐతే ఆమెకు వయలెన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఆమె సూర్యతో ప్రేమలో పడిన తర్వాత తన శనివారం సీక్రెట్ గురించి ఆమెకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అనుకోకుండా ఒక షాకింగ్ సంఘటన ఎదురవుతుంది. కానీ ఓ కారణంగా ఊరి వదిలి వెళ్లినా ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. ఇక సోకులాపురంలోనే దయానంద్ (ఎస్‌జే సూర్య),పొలిటికల్ లీడర్ కుర్మానంద్ (మురళీశర్మ) ఇద్దరు అన్నదమ్ములు తమ ఆస్తి కోసం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకొంటుంటారు. అయితే దయానంద్, కూర్మానంద్ మధ్య నాని దూరాల్సి వస్తుంది. పరమ రాక్షసుడిగా పేరున్న దయను ఢీకొట్టడంతో సూర్య తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. మరి ఆ ఇబ్బందులేంటి..వాటిని అధిగమించి దయ మీద సూర్య పైచేయి సాధించగలిగాడా? కూర్మానంద్ తన తమ్ముడికి ఆస్తిని ఇస్తాడా? అసలు దయానంద్ గొడవల్లోకి సూర్య ఎందుకు ఎంటర్ అయ్యాడు? సోకులపాలెం ప్రజల్ని సూర్య ఎలా కాపాడాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే. 

ఎలా ఉందంటే:

ఈ సినిమా స్టోరీ లైన్ ఏమిటి? అనే విషయాన్ని సినిమా యూనిట్ ప్రమోషన్స్ మొదటి రోజు నుంచి చెబుతూ వచ్చింది. అలాగే నాని కూడా మేము చెప్పాల్సింది అంతా ప్రమోషనల్ కంటెంట్ లోనే చెప్పేశాం. ఇక మీరు థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయడమే అన్నట్టుగా ప్రేక్షకులను ఒక రకమైన మైండ్ సెట్ తో ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశారు.

త‌న టిఫిక‌ల్ కంఫ‌ర్ట్‌ జోన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి యూనిక్ స్టోరీలైన్‌తో ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ స‌రిపోదా శ‌నివారం మూవీని తెరకెక్కించాడు. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవ‌తార్‌లో నాని కనిపించాడు. నానికి ధీటుగా ఎస్‌జే సూర్య విల‌నిజం డిజైన్ టీజర్, ట్రైలర్ తోనే మాస్ బొమ్మ సూపర్బ్ అనేలా చూపించారు వివేక్ ఆత్రేయ.  

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తాను రాసుకొన్న పాయింట్ బాగుంది. మదర్ సెంటిమెంట్‌ను జోడించి..యాక్షన్ డ్రామాగా డిజైన్ తీరుకూడా బాగుంది. ఈ యాక్షన్ డ్రామాలో హ్యుమర్, ఫన్ బ్యాక్ డ్రాప్‌తో పాత్రలను తీర్చిదిద్దిన విధానంగా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉండటం పాజిటివ్ విషయం. అలాగే ఓ హీరో..హీరోయిన్ వల్ల ఒక ఏరియాలోని ప్రజల కోసం నిలబడటం అనే రెగ్యులర్ కథని అమ్మ ఎమోషన్, శనివారం మాత్రమే తన కోపం చూపించడం అనే పాయింట్స్ తో సరికొత్తగా చూపించారు. అయితే సినిమా కథని నవలగా కొన్ని విభాగాలుగా విడగొట్టి వివేక్ ఆత్రేయ తనదైన స్టైల్ లో స్క్రీన్ ప్లే చూపించాడు.

ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే..సూర్య క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసి అతని శనివారం సీక్రెట్ ఏమిటి? ఎందుకు ఆవేశాన్ని శనివారానికి మాత్రమే పరిమితం చేయాల్సి వచ్చింది? లాంటి విషయాలను చాలా కన్విన్సింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అలాగే మూర్ఖత్వానికి పరాకాష్ట, శాడిజానికి నిలువెత్తు రూపంలా ఉండే సీఐ దయ క్యారెక్టర్ ను కూడా ఫస్ట్ ఆఫ్ లోని ఎస్టాబ్లిష్ చేస్తూ వారిద్దరికీ అసలు ఎలా గొడవ ప్రారంభమవుతుంది అనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా మలవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఇక చారులత పరిచయం, ప్రేమ, దయానంద్ గొడవలోకి ఎంటర్ అవ్వడంతో కథనం రసవత్తరంగా మారింది అని చెప్పుకోవొచ్చు. విరామం దగ్గర వచ్చే మలుపుతో ద్వితీయార్ధం మీద ఆసక్తి పెరగడం బాగుంది. 

ఇక సెకండాఫ్‌లో యాక్షన్ డ్రామా పీక్స్‌కు తీసుకెళ్లాడు. అయితే ఆ డ్రామాలో రొమాన్స్ పరిధి పెంచి ఉంటే కొంత రిలీఫ్ ఉండేదనిపిస్తుంది. కాఫీ, టీల సీన్, పబ్‌లో యాక్షన్ ఎపిసోడ్, కొన్ని సెంటిమెంట్ సీన్లు ఈ సినిమాకు ప్లస్ పాయింట్. డైరెక్టర్ గత సినిమాలతో పోలిస్తే ఇలాంటి ఒక సినిమా ఆయన దర్శకత్వంలో వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అలాంటి ఒక సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసి దాదాపు విజయవంతం అయ్యాడు. అంతేకాకుండా ఓవైపు వినోదం పండిస్తూనే ఇంటెన్స్ డ్రామాతో ప్రేక్షకులను చాలా వరకు ఎంగేజ్ చేశాడు డైరెక్టర్. పాటలు కూడా లేకుండా 2 గంటల 54 నిమిషాల నిడివితో సినిమా సాగడం వల్ల కొంత సాగతీతగా అనిపించడం ఒక్కటే 'సరిపోదా శనివారం'లో సమస్య. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు 

నటీనటుల విషయానికి వస్తే:

సూర్య పాత్ర‌లో నాని యాక్టింగ్ అదుర్స్‌, మాస్ రోల్‌లో కుమ్మేశాడ‌ని చెప్పొచ్చు. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవ‌తార్‌లో కనిపించడం కొత్తగా ఉంది.  నానికి ధీటుగా ఎస్‌జే సూర్య విల‌నిజం, ద‌యానంద్ అనే క‌న్నింగ్  పోలీస్ పాత్రలో అదరగొట్టేసాడు. కానిస్టేబుల్ పాత్రలో ప్రియాంక మోహన్ క్యూట్ గా మెప్పించింది. ఉన్నంతలో పద్ధతి గల అమ్మాయి పాత్రలో మెప్పించింది. తల్లి పాత్రలో అభిరామి కాసేపే కనిపించినా మంచి ఎమోషన్ పండించింది. నాన్న పాత్రలో సాయి కుమార్ బాగా నటించారు. సోకుల పాలెం ప్రజలుగా చేసిన నటీనటులు, మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా బాగా నటించారు.

సాంకేతిక అంశాలు: 

 సినిమా టెక్నికల్ గా మాత్రం చాలా బాగుంది. మురళీ జీ సినిమాటోగ్రఫీ విజువల్స్, లైటింగ్ సెటప్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జెక్స్ బిజోయ్ అదరగొట్టాడు. సినిమాలో పూర్తి స్థాయి పాట ఒక్కటీ లేదు కానీ.. బిట్ సాంగ్స్ ఓకే అనిపిస్తాయి. కార్తీక శ్రీనివాస్‌ ఎడిటింగ్ విషయంలో కాస్తా పని పెడితే బాగుండేది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం చాలా ఫ్రేమ్ లో కనబడింది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.. తనను తాను ఈ చిత్రంతో కొత్తగా ఆవిష్కరించుకున్నాడు.