
వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో నాని సొంత నిర్మాణ సంస్థ 'వాల్ పోస్టర్స్ సినిమాస్ బ్యానర్‌లో' ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇందులో ప్రియదర్శి లాయర్ పాత్రలో నటించగా, వెటరన్ హీరో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలో నటించారు.
కోర్ట్ మూవీ శుక్రవారం (మార్చి 14 న) థియేటర్స్లో గ్రాండ్గా విడుదల కానుంది. అయితే, ఈ మూవీ రిలీజ్కు రెండు రోజులు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్‌తో (మార్చి 12న) థియేటర్స్లో రెండు షోలు వేశారు. అందులో ఒకటి సెలబ్రిటీ స్పెషల్ కాగా మరొకటి మీడియా కోసం ప్రదర్శించారు. మరి కోర్ట్ లో సాగే డ్రామా ఎలా ఉంది? కోర్ట్ నేపథ్యంలో వచ్చిన సినిమాల మాదిరి ఉత్కంఠ ఇందులో ఉందా? లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
చంద్ర శేఖర్ అలియాస్ చందు (రోషన్)కు చదువు సరిగా అబ్బదు. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. అలా వచ్చిన ప్రతి పనిని కాదనుకుండా ఉపాధి కోసం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ ఇంటి దగ్గర వాచ్ మెన్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అలా అనుకోకుండా అక్కడ ఓ పెద్దింటి అమ్మాయి, ఇంటర్ చదువుతున్న జాబిలి (శ్రీదేవి)తో ప్రేమలో పడుతాడు. ఇక వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలా ఫోన్ లో మాట్లాడుకోవడం, కలవడం ఇలా చాలా లోతుగా వెళుతారు.
ఈ క్రమంలో ఓ సంఘటన మూలాన వీరి ప్రేమ విషయం జాబిలి ఇంట్లో తెలుస్తోంది. ఇక ప్రాణం కంటే పరువు, స్థాయి ముఖ్యమని బ్రతికే కోపిష్టి అయిన జాబిల్లి మామయ్య మంగపతి (శివాజీ) దృష్టికి వస్తుంది. ఆ తర్వాత తన పలుకుబడిని అంత ఉపయోగించి, తమ ఇంట్లో అమ్మాయిని రేప్ చేశాడని చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు.
ALSO READ | అనుపమ పరమేశ్వరన్ మూవీలో .. సమంత క్యామియో
దాంతో బెయిల్ కూడా దొరకకుండా చందు మీద పోక్సో యాక్ట్ పెట్టించిన లాయర్ దాము (హర్షవర్ధన్) కోర్టులో ఎలాంటి ఎత్తులు వేశాడు? మరి చందుని ఎలాగైనా బయటకు తీసుకు వచ్చేందుకు పేరున్న పెద్ద లాయర్ మోహన్ రావు (సాయి కుమార్) అసిస్టెంట్ తేజ (ప్రియదర్శి) ఏం చేస్తారు?
అసలు పోక్సో చట్టం ఏం చెబుతుంది? నేరం రుజువైతే చందుకు ఎలాంటి శిక్ష పడుతుంది? కోర్ట్‌లో జరిగిన వార్ ఏంటి? ఫైనల్‌గా చందుని ఈ కేసు నుంచి బయటకి తీసుకొచ్చారా? లేదా అనేది సినిమా థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే:
కోర్టు నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కూడా అదే మాదిరి ఎత్తులు, పై ఎత్తులతో ఉత్కంఠగా సాగింది. చదువు గురించి, బతకడం గురించి అందరికి తెలిసిన, తెల్వకపోయిన చట్టాల గురించి తెలియాలి అనే చెప్పే కథ ఇది. చట్టం అనేది తెలియక ఎంతో మంది అమాయకులు చేయని నేరాలకు శిక్షను అనుభవిస్తున్నారని ఈ కోర్ట్ మూవీ అసలు కథ.
ఓ 18 ఏళ్ళు నిండని మైనర్ అమ్మాయిని ప్రేమించినా, ఆమె అంగీకారంతో ముట్టుకున్నా కూడా అది నేరం అవుతుందని ఎంత మందికి తెలుసు? అనే ఓ ప్రశ్నను ప్రియదర్శి పాత్రతో లేవనెత్తాడు దర్శకుడు రామ్ జగదీష్. ఈ కోర్ట్ సినిమాలో ప్రధాన అంశం ఈ పోక్సో చట్టమే.
ఇదివరకు చట్టం నేపథ్యంలో వచ్చిన నాంది సినిమా కూడా చేయని నేరానికి శిక్ష అనుభవించే వ్యక్తిగా వచ్చింది. సెక్షన్ 211 చుట్టూ సాగే కథతో ‘నాంది’ ప్రేక్షకుల్ని మెప్పించింది. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే ప్రజలు ఎక్కువగా ఉంటే, చట్టాలను అడ్డుగా పెట్టుకుని అధికారుల చేత తమ పగ, ప్రతీకారాలు ఎలా తీర్చుకుంటున్నారు అని ఈ మూవీ చెప్పుకొచ్చింది.
ఫస్టాఫ్ అంత స్వచ్ఛమైన ప్రేమకు తావు ఇచ్చిన దర్శకుడు, ఇంటర్వెల్, సెకండాఫ్ తో చట్టాల చుట్టూ ఆసక్తికరమైన కథను అల్లుకున్నాడు. కథలెన్నో చెప్పారు అనే పాట ఫస్టాఫ్ లో ఆకట్టుకుంటుంది. టీనేజ్‌లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఆకర్షణలు, పరిచయాలు, వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పడమే సగభాగం కథైతే, ఓ చట్టంపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యం మిగతా సగభాగం కథగా ఉంది కోర్ట్.
ఎవరెలా చేశారంటే:
చందు, శ్రీదేవి పాత్రల్లో నటించిన హర్ష్ రోషన్, శ్రీదేవి కథకు ప్రాణం పోశారు. తమలోని నటనను బయటకు తీశారు. మంగపతి క్యారెక్టర్ లో నటించిన శివాజీ ఈ మూవీతో ఒక సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు. తనలోని సరికొత్త విలనిజం పరిచయం చేశాడు.
ప్రియదర్శి తనలోని సహజమైన నటనతో మరోసారి మెప్పించాడు. కోర్టు రూమ్ లో వాదించిన తనశైలితో మెప్పించాడు. సాయి కుమార్ ఎప్పటిలాగే తన మార్క్ చూపించాడు. మంగపతి పెట్టిన కేసుని నడిపించే న్యాయవాదిగా హర్షవర్ధన్ నటన ఆసక్తిగా ఉంటుంది. మిగతా నటి నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.