వరంగల్, వెలుగు: వరంగల్ తూర్పు మాజీఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీజేపీ ముఖ్య నేతలతో కలిసి చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ నరేందర్ వెంట నడిచిన అనుచరులు, గులాబీ కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో మిగిలిన అనుచరులతో కలిసి కాషాయ కండువా కప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ప్రతిపక్షం, సొంత పార్టీ లీడర్లతోనూ వైరమే..
గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్ తూర్పు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గత ఎన్నికల ముందు వరకు నన్నపునేని నరేందర్ తన హవా చూపారు. అదే సమయంలో అనుచిత వ్యాఖ్యల కారణంగా ప్రతిపక్ష లీడర్లతో పాటు, సొంత పార్టీలోని ఇతర నేతలకూ శత్రువుగా మారారు. సొంత పార్టీకే చెందిన మేయర్ గుండు సుధారాణి మొదలు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వరకు, గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో సైతం వైరం పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో నరేందర్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, సీనియర్ లీడర్లు హైకమాండ్‌ను కోరారు. పలువురు కార్పొరేటర్లు సీక్రెట్ మీటింగ్‌లు పెట్టుకొని ఎన్నికల్లో నరేందర్‍కు సహకరించబోమని స్పష్టం చేశారు. అయినా వారి మాటలు పట్టించకోకుండా వరంగల్ తూర్పు టికెట్ నరేందర్‌కే ఇచ్చారు. దీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాండిడేట్ కొండా సురేఖ విజయం సాధించగా, ఎర్రబెల్లి ప్రదీప్‍రావు సెకండ్ ప్లేస్ పొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నరేందర్ మూడో స్థానానికే పరిమితం అయ్యారు.
కొండా సురేఖ మంత్రి కావడంతో టెన్షన్
కొండా సురేఖ గతంలో మంత్రిగా పనిచేసిన టైంలో నరేందర్ కార్పొరేటర్‌గా ఉన్నారు. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాక సభలు, సమావేశాల్లో కొండా దంపతులతో పాటు, మిగతా క్యాండిడేట్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, కొండా సురేఖ మంత్రి కావడంతో ఆయనకు టెన్షన్ పట్టుకుంది. గతంలో కొండా సురేఖ అనుచరులపై పోలీస్ కేసులు బనాయించడం, బెదిరించడం, దాడి చేయడం వంటి ఘటనలు చేయడంతో, ఇప్పుడు అదే పరిస్థితి తనకు ఎదురవుతుందేమోనన్న ఆందోళనలో పడ్డారు. ఆయన వెంట నడిచిన గులాబీ లీడర్లు, సీనియర్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పరిస్థితి బాగా లేకపోవడం, నరేందర్ కాంగ్రెస్‌లోకి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
నరేందర్ రాకపై బీజేపీలో వ్యతిరేకత
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతున్నారనే సమాచారం అందడంతో కమలం నేతలు అయోమయంలో పడ్డారు. అదే నియోజకవర్గానికి చెందిన ఎర్రబెల్లి ప్రదీప్‍రావు, గంట రవికుమార్ నరేందర్ బాధిత లిస్ట్‌లో ఉన్నారు. దీంతో నరేందర్ బీజేపీలోకి రావడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఆయన మాత్రం వరంగల్ లీడర్లతో సంబంధం లేకుండా హనుమకొండకు చెందిన ఒకరిద్దరు నేతలతో రాష్ట్ర నేతల వద్ద రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన చేరికపై పార్టీ లీడర్లు ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే నరేందర్‌తో పాటు ఐదుగురు కార్పొరేటర్లు మూడు, నాలుగు రోజుల్లోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.