అహో ఒసాకా.. నవోమిదే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్
ఫైనల్లో బ్రాడీపై గ్రాండ్ విక్టరీ
కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్ సొంతం
‘నువ్వు రన్నరప్‌గా నిలిస్తే జనం నిన్ను గుర్తుపెట్టుకోరు. అదే విన్నర్ అయితే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ మూడు రోజుల కిందట జరిగిన సెమీఫైనల్లో లెజెండరీ ప్లేయర్ సెరెనా విలియమ్స్‌ను ఓడించిన తర్వాత నవోమి ఒసాకా అన్న మాటలివి. వాటితో తన టార్గెట్ ఏంటో చెప్పేసిన జపాన్ స్టార్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ విమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను రెండోసారి ముద్దాడింది. అమెరికా ప్లేయర్ జెన్నిఫర్ బ్రాడీని ఫైనల్లో చిత్తుచేసిన నవోమి..హార్డ్ కోర్ట్‌లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసింది. ఓవరాల్‌గా నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకుని జేజేలు కొట్టించుకుంది.
మెల్‌బోర్న్: జపాన్ సెన్సేషన్.. నవోమి ఒసాకా మరోసారి అద్భుతం చేసింది. హార్డ్‌కోర్ట్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన జెన్నిఫర్ బ్రాడీ(అమెరికా)కి చుక్కలు చూపెట్టి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 విమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక్కడి రాడ్ లేవర్ ఎరెనాలో శనివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ ఒసాకా 6–4, 6–3తో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీపై తిరుగులేని విజయం సాధించింది. దీంతో గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఒసాకా విక్టరీల రికార్డు 4–0తో మెరుగైంది. మేజర్ టోర్నీల్లో క్వార్టర్‌ఫైనల్, ఆ తర్వాతి మ్యాచుల్లో విక్టరీల రికార్డు 12–0కు చేరింది. అంతేకాక 2020 ఫిబ్రవరి తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ ఓడని ఒసాకా వరుసగా 21వ విజయం సాధించింది. మరోపక్క 1991లో మోనిక సెలెస్ తర్వాత తొలి నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో గెలిచిన మహిళగా ఒసాకా చరిత్ర సృష్టించింది. 2019లోనూ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన ఒసాకా.. యూఎస్ ఓపెన్(2018, 2020)లోనూ రెండు సార్లు విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా నవోమి నాలుగు గ్రాండ్‌స్లామ్స్ సాధించగా.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో అమెరికా సిస్టర్స్ సెరెనా విలియమ్స్(23), వీనస్ విలియమ్స్(7) మాత్రమే జపాన్ ప్లేయర్ కంటే ఎక్కువ టైటిల్స్ గెలిచారు. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఒసాకా విజయం సాధిస్తే వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్‌లో టాప్ లిస్ట్‌లోకి చేరుతుంది.
వార్ వన్‌సైడ్
77 నిమిషాల పాటు జరిగిన మెగా ఫైనల్ వన్‌సైడ్ వార్‌గా ముగిసింది. బలమైన సర్వ్‌లతో బ్రాడీని ఒసాకా ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే, ప్రత్యర్థి తన కంటే పెద్ద ప్లేయర్ అయినప్పటికీ 24వ ర్యాంకర్ జెన్నిఫర్ మ్యాచ్‌ను ధాటిగా మొదలుపెట్టింది. ఆమె దూకుడు చూస్తే హోరాహోరీ తప్పదనిపించింది. ఫస్ట్ గేమ్‌లో 4–4తో స్కోర్లు సమంగా ఉన్న దశలో అమెరికన్‌కు సెట్ గెలిచే చాన్స్ కూడా దొరికింది. రన్నింగ్ మూమెంట్‌లో ఓ అదిరిపోయే విన్నర్ కొట్టిన బ్రాడీ 40–30కి చేరి బ్రేక్‌పాయింట్ చాన్స్ దక్కించుకుంది. దీంతో తనను మరింత ప్రోత్సహించాలని క్రౌడ్‌కు సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే, ఓ క్రాస్‌కోర్ట్ ఫోర్ హ్యాండ్ విన్నర్ కొట్టిన ఒసాకా.. అమెరికన్ దూకుడుపై నీళ్లు కుమ్మరించింది. ఆ వెంటనే జెన్నిఫర్ రెండు ఎర్రర్స్ చేయడం తో ఒసాకా లీడ్ సాధించింది. ఆ తర్వాత బ్రాడీ డబుల్ ఫాల్ట్ చేయడం, ఫోర్ హ్యాండ్ షాట్‌తో బాల్‌ను నెట్‌కు కొట్టడంతో ఒసాకా సులువుగా ఫస్ట్ సెట్ ఖాతాలో వేసుకుంది. సెకండ్ సెట్‌లో బ్రాడీ పూర్తిగా తేలిపోయింది. తొలి నాలుగు గేమ్‌లను సింపుల్‌గా గెలిచిన ఒసాకా 4–0తో మ్యాచ్‌పై పట్టుబిగించింది.రెండు సెట్లలో కలిపి వరుసగా ఆరు గేమ్‌లు గెలిచిన నవోమి ఊపు మీదున్న దశలో జెన్నిఫర్ ఓ గేమ్ గెలిచి కాస్త పోరాటపటిమ చూపెట్టింది. కానీ ఒసాకా దూకుడు ముందు ఆమె నిలబడలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఆరు ఏస్‌లు, 16 విన్నర్లు కొట్టిన ఒసాకా ఐదు బ్రేక్ పాయింట్ చాన్సుల్లో నాలుగింటిని సద్వినియోగం చేసుకుంది. రెండు డబుల్ ఫాల్ట్స్, 24 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. మరోపక్క 2 ఏస్‌లు, 15 విన్నర్లు కొట్టిన బ్రాడీ .. నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేసింది. 31 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసిన అమెరికన్ నాలుగు బ్రేక్ పాయింట్ చాన్సుల్లో రెండింటిని మాత్రమే ఉపయోగించుకుంది. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఒసాకా రెండో సారి ముద్దాడింది.
జొకో x మెద్వెదెవ్
నేడు మెన్స్ సింగిల్స్ ఫైనల్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొమ్మిదో టైటిల్‌పై కన్నేసిన వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ అందుకు అడ్డుగా ఉన్న డానిల్ మెద్వెదెవ్ పని పట్టేందుకు రెడీ అయ్యాడు. శనివారం జరిగే మెన్స్ సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకో (సెర్బియా).. నాలుగో సీడ్ డానిల్ మెద్వెదెవ్(రష్యా) అమీతుమీ తేల్చుకోనున్నాడు. మెల్‌బోర్న్‌లో ఫైనల్ చేరిన ఎనిమిదిసార్లూ జొకో టైటిల్‌తో తిరిగొచ్చాడు. అదే ఊపుతో ఇక్కడ తొమ్మిదోసారి విజేతగా నిలవాలని చూస్తున్నాడు. మరోపక్క కెరీర్‌లో రెండోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన మెద్వెదెవ్ వరుసగా 20 విజయాలతో మంచి ఊపుమీదున్నాడు. జొకో జోరును అతను అడ్డుకుంటాడేమో చూడాలి.