అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ యాక్ట్ విషయంలో ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అధికార వైసీపీ చేసిన ఫిర్యాదలు మేరకు ఈసీ సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ కేసుల అంశంపై స్పందించారు నారా లోకేష్. యువగలం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న నారా లోకేష్, జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడితే తనపై కేసులు పెట్టారని, సీఐడీ కేసులు కాదు సీబీఐ కేసులు, ఇంటర్పోల్ కేసులు పెట్టినా కూడా తగ్గేదిలేదని అన్నారు లోకేష్. తనపై 23 కేసులు పెట్టారని, ఇది 24వ కేసు అవుతుంది అంత మాత్రాన భయపడేది లేదని అన్నారు లోకేష్. కాగా, వైసీపీ ఫిర్యాదుతో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ చంద్రబాబును A1గా, లోకేష్ ను A2గా చేర్చింది. ఈసీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది.