నేను ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు : మంత్రి లోకేష్

ఏపీ ఎన్నికల ప్రచారంలో హైలైట్ గా నిలిచిన అంశాల్లో ప్రధాన అంశం రెడ్ బుక్. మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచార సమయంలో రెడ్ బుక్ చూపిస్తూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నాయకుల పేర్లు రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నానని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరి అంతు చూస్తానని బహిరంగంగానే అన్నారు. తాజాగా మరోసారి రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారు లోకేష్. తన దగ్గర రెడ్ బుక్ ఉందని బహిరంగసభలోనే చెప్పానని అన్నారు.

తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి చట్టప్రకారం శిక్షిస్తామన్న ప్రకటనకు కట్టుబడి ఉన్నానని అన్నారు. రెడ్ బుక్ ఇంకా తెరవలేదని, తెరవకముందే జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని అన్నారు. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీ వచ్చి చెప్తే వాస్తవాలు వివరిస్తామని అన్నారు. వైసీపీ నేతల్లా కూటమి నేతలు ఎవ్వరూ బూతులు మాట్లాడారని అన్నారు లోకేష్. కాగా, ఏపీలో వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో లోకేష్ రెడ్ బుక్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.