కర్నూలు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఎక్కడికక్కడ విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్. స్థానిక సమస్యలను ఏకరువు పెడుతూ,వాటి పరిష్కారం ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు.కేసులకు భయపడేది లేదని, 'సిట్' విచారణకు కూడా తాము భయపడమన్నారు లోకేష్ . అరెస్ట్ లంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.
గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం విచారణకు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 'సిట్'కు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విచారణ వేగవంతం అవుతుందని, చంద్రబాబు, లోకేష్ అరెస్ట్ ఖాయమని అంటున్నారు వైసీపీ నేతలు. ఇన్నాళ్లూ స్టేలతో తప్పించుకు తిరిగారని, ఇక అది సాధ్యం కాదని ఎద్దేవా చేస్తున్నారు. ఈ కౌంటర్లపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు
సిట్ వేసి ఏం పీకుతారు..?
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా కొండను తవ్వి ఎలుకను కాదు కదా ఎలుక తోకను కూడా పట్టుకోలేనివాళ్లు 'సిట్'వేసి ఏం పీకుతారని ప్రశ్నించారు నారా లోకేష్. తాము జైలుకు వెళ్లే సంగతి పక్కన పెడితే... జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు లోకేష్. జే బ్రాండ్ మద్యంతో ప్రాణాలు తీస్తున్న జగన్ జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. "జే బ్రాండ్ మద్యంలో ఒక్క సీసా చాలు.. మీరు, మీ జే బ్రాండ్ గ్యాంగ్ అంతా జైలులో ఉండేందుకు రెడీగా ఉండండి.." అంటూ మద్యం తీసుకెళ్తున్న వాహనం వద్ద సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లోకేష్.