యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. సోమవారం లక్ష కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి తిరువేంకటపతి సేవను జరిపారు. సాయంత్రం ఆలయంలో నిత్య పూజల అనంతరం.. ముఖ మంటపంలో మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం పూజలను శాస్త్రబద్ధంగా నిర్వహించారు. జయంతి ఉత్సవాల్లో టెంపుల్ చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిత్యం భక్తుల తో నిర్వహింపబడే ఆర్జిత సేవలను ఈ నెల 22 వరకు తాత్కాలికంగా రద్దు చేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కొండపైన నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. యాదగిరిగుట్టకు చెందిన శ్రీ వీరప్రతాప భజన మండలి, శ్రీ భాగ్యలక్ష్మీ మహిళా భజన మండలి బృందం సభ్యులు భజన నిర్వహించారు. తోరణాల పద్మజ, మంద శ్రీనివాస్ బృందం నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే సికింద్రాబాద్ కు చెందిన కనకదుర్గ నృత్య విభావరి, నిర్మల ప్రభాకర్ బృందం చేసిన భరతనాట్యం.. యుక్తారెడ్డి బృందం చేసిన కూచిపూడి నృత్యం భక్తులను పరవశింపజేశాయి.
దీంతోపాటు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోనూ వేడుకలు నిర్వహించారు. నేడు ఉదయం ప్రధానాలయంలో నిత్య మూలమంత్ర హవనాలు, లక్షపుష్పార్చన, కాళీయ మర్దన అలంకార సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం నృసింహ మూలమంత్ర హవనాలు, హనుమంత వాహనంపై రామావతార అలంకార సేవను జరపనున్నారు. పాతగుట్టలో విశేష స్నపనం, నిత్యహవనం, నృసింహ మూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన పూజలు జరపనున్నారు.