- చైర్మన్ నేనంటే నేనంటున్న ఇద్దరు నేతలు
- వైస్ చైర్మన్‌దే పదవని తేల్చిన సహకార సొసైటీ
- ముగ్గురు పిల్లలున్నారన్న కారణంతో పదవి కోల్పోయిన నారాయణ
- కోర్టు నుంచి స్టే రావడంతో కొనసాగింపు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవిపై ఊగిసలాట కొనసాగుతోంది. చైర్మన్ పదవి తనదంటే తనదని చైర్మన్ గాజుల నారాయణ, వైస్ చైర్మన్ గడ్డం విఠల్ పోటీపడుతున్నారు. దీంతో ఇద్దరి నేతల తీరుతో కస్టమర్లు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కాగా వైస్ చైర్మన్‌దే పదవని సహకార సొసైటీ తేల్చగా.. కోర్టు నుంచి స్టే తెచ్చుకొని నారాయణ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
జెండా ఆవిష్కరణలో వివాదం
జనవరి 26న రిపబ్లిక్ డేను సందర్భంగా సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎదుట జెండా ఆవిష్కరణలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఇద్దరూ బాహాబాహీగా తలపడ్డారు. తానంటే తాను చైర్మన్ అంటూ జెండా ఎగరేయడానికి పోటీ పడ్డారు. నారాయణ కోర్టు స్టేను జేబులో పెట్టుకుని వచ్చి చూపించారు. గడ్డం విఠల్, ఇతర డైరెక్టర్లు.. విఠల్ జెండా ఎగురవేయాలని పట్టుబట్టడంతో ఆయనే జెండా ఆవిష్కరించారు. ఇద్దరు నేతల తీరు సోషల్ మీడియాతో వైరల్‌గా మారింది. కోర్టులో కేసు తేలితేనే చైర్మన్ ఎవరనేది తెలుస్తుంది.
రెండుసార్లు అవిశ్వాసం
సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్‌పై 2022లో ఒకసారి, ఇటీవల మరోసారి డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ నేతల బుజ్జగింపులతో అవిశ్వాసం వీగిపోయింది. సుమారు రూ.100 కోట్ల లావాదేవీలు జరిగే అర్బన్ బ్యాంక్‌కు 2018 లో అర్బన్ బ్యాంక్ ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ డైరెక్టర్లలో చాలా మంది ఓడిపోయారు. దాదాపు 8మంది ఇండిపెండెంట్లే గెలిచారు.
నాటి మంత్రి కేటీఆర్ అనుచరులు చక్రం తిప్పడంతో గాజుల నారాయణ చైర్మన్ అయ్యారు. కానీ ఏడాదికే ఆయనపై అర్బన్ బ్యాంక్ పాలకవర్గంలో అసంతృప్తి నెలకొంది. చైర్మన్ ఏకగ్రీవ నిర్ణయాలతో విసుగుచెందామని డైరెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఇద్దరు నేతలు నేనంటే,నేనే చైర్మన్ అనిచెప్పుకోవడంతో చైర్మన్ గిరిపై ఎటూ తేలని పంచాయితీనెలకొంది.
కోర్టు స్టేతో నారాయణ.. సొసైటీ యాక్ట్ ప్రకారం విఠల్
జిల్లాకేంద్రంలోని సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల నారాయణకు ముగ్గురు పిల్లలున్నారు. సహకారం చట్టం ప్రకారం... చైర్మన్ పదవి చేపట్టాలంటే ఇద్దరు పిల్లలకు మించొద్దు. దీనిపై ముగ్గురు పిల్లల బర్త్ సర్టిఫికెట్లు, ఇతర ఆధారాలతో డైరెక్టర్ రాములు డీసీవోకు ఫిర్యాదు చేశారు. స్పందించిన డీసీవో నారాయణ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా, చైర్మన్ గా కొనసాగరాదని జనవరి 13న ఆదేశాలు జారీ చేశారు.
దీంతో చైర్మన్ పదవి ఖాళీ అయింది. అనంతరం మిగతా డైరెక్టర్లు వైస్ చైర్మన్ గడ్డం విఠల్‌ను చైర్మన్ గా ఎన్నుకున్నారు. అయితే గాజుల నారాయణను అనర్హుడిగా ప్రకటించడంతో హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. కోర్టు స్టే తో తానే చైర్మన్‌నని చెప్పుకుంటున్నారు. మరోవైపు గడ్డం విఠల్ కో ఆపరేటివ్ యాక్ట్ ప్రకారం తానే చైర్మన్ అని ప్రకటించుకోవడంతో బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లలో అయోమయం నెలకొంది.