![రూ.5 కోట్ల చోరీ.. నారాయణ గూడ నుంచి నాగ్పూర్లో తేలారు.. ఎలా దొరికారంటే..](https://static.v6velugu.com/uploads/2025/02/narayanaguda-rs-5-crore-theft-case-solved-within-24-hours-by-hyderabad-police_uFisdZ65ft.jpg)
యజమాని కుటుంబంతో కుమార్తె వివాహం కోసం దుబాయ్ వెళ్లారు. ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాల్సిన పనివాళ్లు.. అదే అదునుగా ఇల్లును గుల్ల చేశారు. 5 కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాలు, నగదు, ఫారెన్ కరెన్సీ ని చోరీ చేసి హైదరాబాద్ నగరాన్ని దాటారు. హైదరాబాద్ నారాయణ గూడలో సంచలనం సృష్టించిన కేసును ఈస్ట్ జోన్, సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా వేగంగా ఛేదించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..
రోహిత్ కేడియా అనే వ్యాపారి కుమార్తె పెళ్లి కోసం దుబాయ్ కి వెళ్లారు.. ఈ క్రమంలో ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం మొల్హూ ముఖియా, సుషీల్, బాసంతి ఆరిలు చోరికి పాల్పడ్డారు. పనివాళ్లను నమ్మి ఇల్లును చూసుకోమని చెప్పి పెళ్లికి వెళ్లిన సమయంలో చోరికి పాల్పడ్డారు. చోరీ జరిగిన తర్వాత కేసు నమోదైన వెంటనే 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
నిందితులు చోరీ చేసి తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుండగా నాగ్ పూర్ లో పట్టుబడ్డారు. నాగ్ పూర్ రైల్వే పోలీసుల సహకారంతో హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు రైలులో తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో మొల్హూ ముఖియా గతంలో దోమలగూడ పరిధిలో వృద్దురాలి పై దాడి చేసి కోటి రూపాయలు దొంగిలించిన కేసులోను ప్రధాన నిందితుడు. ఈ చోరీ కేసు ను 24 గంటల్లో ఛేదించిన ఈస్ట్ జోన్, టాస్క్ ఫోర్స్ పోలీసులను అభినందిస్తున్నామని సీపీ ఆనంద్ తెలిపారు.