ఎకరాకు రూ.3.50 లక్షలే.. కొత్త చెరువు భూసేకరణలో సర్కారు వివక్ష

ఎకరాకు  రూ.3.50 లక్షలే..  కొత్త చెరువు భూసేకరణలో సర్కారు వివక్ష

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు: నారాయణ ఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మనూరు మండలం ఎనక్‌ పల్లి, ఇరాక్‌ పల్లి గ్రామాల మధ్య చెరువు నిర్మాణానికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం నిర్వాసిత రైతుల బాధలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే దాదాపు 50 ఎకరాలను గుర్తించిన అధికారులు రైతులకు 10 రోజుల కింద నోటీసులు జారీ చేశారు. అయితే కేవలం ఎకరాకు రూ.3.50 లక్షల పరిహారం ఇస్తామని అందులో పేర్కొనడాన్ని బాధిత రైతులు వ్యతిరేకిస్తున్నారు. తామంతా నిరుపేద గిరిజనులమని, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని తీసుకుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.10 లక్షలు ఇచ్చినా అంగీకరించేది లేదని, భూమికి బదులు భూమి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ప్రతిపక్షాల మద్దతు

గిరిజన రైతులు చేపడుతున్న నిరసనలకు కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘాల నేతలు మద్దతు తెలుపుతున్నారు. నిర్వాసితుల్లో అందరూ చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వారికి ఉన్న కొద్దిపాటి భూమిని తీసుకుంటే రోడ్డున పడతారని వాపోతున్నారు.  సాగునీటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు రూ. 12 లక్షలకుపైగా పరిహారం ఇస్తున్న సర్కారు.. ఇక్కడి రైతులకు మాత్రం రూ.3.5 లక్షలు మాత్రమే ఇస్తామనడం సరికాదని మండిపడుతున్నారు. మరోచోట భూమికి బదులు భూమి ఇచ్చాకే చెరువు నిర్మాణం చేపట్టాలని, లేదంటే రైతులతో పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

50 ఎకరాలు.. 40 మంది రైతులు

ఎనక్ పల్లి, ఇరాక్ పల్లి గ్రామాల మధ్య ఉన్న 50 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమిని ఎనక్ పల్లి, ఇరాక్ పల్లితో పాటు రత్నానాయక్ తండా, శామానాయక్ తండాలకు చెందిన 40 మంది గిరిజన రైతులు వారసత్వంగా సాగు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో సాగునీటి వసతులు తక్కువ కావడంతో ప్రభుత్వం చెరువును నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్వే చేసిన అధికారులు ఎకరా, అరెకరా ఉన్న రైతుల భూమినే గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేయగా రైతులు ఆందోళనకు దిగుతున్నారు.  ఇటీవల ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్‌‌ను కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు.

అందరూ చిన్నకారు రైతులే

మా తండాలో ఇటీవల  కొత్త చెరువు మంజూరు కాగా.. నాకున్న ఎకరన్నర భూమికి అధికారులు నోటీసు ఇచ్చారు. కానీ,  మా కుటుంబానికి ఆ భూమే జీవనాధారం.  పరిహారం కూడా రూ. 3.50 లక్షలే ఇస్తరంట. వీటితో ప్లాట్ కూడా రాదు.  భూమికి బదులు భూమి ఇస్తే  వ్యవసాయం చేసుకొని బతుకుతం.

- దేవిదాస్ , బాధిత రైతు

భూమికి భూమి ఇవ్వాల్సిందే

ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న చెరువు వల్ల పేద గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోం.  బాధిత రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతం. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తం. ఇంత తక్కువ పరిహారం ఎక్కడా ఇస్తలేదు. భూమికి బదులు భూమి ఇవ్వాలి. 

- సంజీవరెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్