సౌలతులు ఉన్నా ఆపరేషన్లు చేయరా?..డాక్టర్లపై నారాయణపేట కలెక్టర్ ఆగ్రహం

సౌలతులు ఉన్నా ఆపరేషన్లు చేయరా?..డాక్టర్లపై నారాయణపేట కలెక్టర్ ఆగ్రహం

మద్దూరు, వెలుగు : ఆసుపత్రిలో అన్ని సౌలతులు ఉండి, ఏడుగురు డాక్టర్లు ఉన్నా గర్భిణులకు సిజేరియన్లు ఎందుకు చేయడం లేదని నారాయణపేట కలెక్టర్  సిక్తా పట్నాయక్  డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం మద్దూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆమె తనిఖీ చేశారు. ఆపరేషన్  థియేటర్ ను వినియోగంలోకి తెచ్చి ఇక్కడే ఆపరేషన్లు చేయాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 

ఔట్ పేషంట్ల వివరాలు, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు ఎంత మంది ఉన్నారు? ఏ సమయాల్లో డ్యూటీ చేస్తున్నారని కో ఆర్డినేటర్  పావనిని అడిగి తెలుసుకున్నారు. థియేటర్  పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో మేల్, ఫిమేల్, చిన్న పిల్లల వార్డులకు వెళ్లి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీయగా, డాక్టర్లు మంచిగా చూస్తున్నారని రోగులు, వారి బంధువులు కలెక్టర్ కు తెలపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. 

రోగుల బెడ్​లపై బెడ్ షీట్లు వేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ల్యాబ్ కు వెళ్లి రిజిస్టర్ ను పరిశీలించి సీడీఎస్  పరీక్ష చేయడానికి మహబూబ్ నగర్ కు ఎందుకు రెఫర్  చేస్తారని, ఇక్కడే చేయాలని సూచించారు.