నారాయణపేట, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు, రెవెన్యూ, ఆర్టీవో, ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. మంగళవారం కలెక్టరే లో రోడ్డు ప్రమాదాల నివారణపై సమావేశాన్ని ఎస్పీ యోగేశ్గౌతమ్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే పేట–మక్తల్ రహదారి అత్యంత దయనీయంగా మారిందని అసహనం వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయ రోడ్డును ఎంపిక చేసి నివేదిక ఇవ్వాలని ఆమె డీఎస్పీ నల్లపు లింగయ్యకు సూచించారు. ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ ఈఈ దేశ్యా నాయక్ ను ఆదేశించారు. ఇటీవలే ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ కింద రూ.14 కోట్లతో 26 కిలోమీటర్ల మేర మక్తల్ కొత్త రోడ్డుకు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించామని ఆర్ అండ్ బీ ఈఈ కలెక్టర్ కు తెలిపారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి తెలుపుతూ జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరికల్ మక్తల్, కోస్గి పట్టణాల్లో వన్ వే రోడ్ల గురించి కమిటీ ఏర్పాటు చేయాలని ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఆర్టీవో మేఘా గాంధీ, డీఈఈ రాములు, ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య, స్థానిక మున్సిపల్ కమిషనర్ సునీత, సీఐలు శివశంకర్, చంద్రశేఖర్, కోస్గి , మక్తల్ మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.