- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో వ్యవసాయశాఖ అధికారులే కీలక పాత్ర పోషించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఏవోలు, ఏఈవోలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి అమ్ముకునేలా రైతులకు ఏఈవోలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
క్లస్టర్ల వారీగా ఆయా కొనుగోలు సెంటర్ల పరిధిలో ఎన్ని క్వింటాళ్ల వడ్లు అమ్మకానికి వస్తున్నాయో ఎప్పటికప్పుడు ఏఈవోలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం సూచించిన సన్నరకం ధాన్యాన్ని నిర్ధారించి రైతులకు టోకన్లు ఇవ్వాలన్నారు. కొనుగోళ్లలో గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ గరీమానరుల, డీఏవో జాన్ సుధాకర్, సివిల్ సప్లై డీఎం దేవదాస్, అధికారులు పాల్గొన్నారు.