నారాయణపేట, వెలుగు : జీవో 69తో నారాయణపేట జిల్లాలో లక్ష ఎకరాలను సాగునీరు అందించాలని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అధికారులను కోరారు. ప్రభుత్వం నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుండడంతో మంగళవారం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసుదన్‌రెడ్డితో కలిసి సమావేశమయ్యారు.
ఎత్తిపోతల పథకంపై అధికారులతో చర్చించారు. జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు, రెండు నియోజకవర్గాలకు తాగునీరు అందించేలా పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, వెనుకబడిన ప్రాంతానికి సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో లిఫ్ట్‌ను ప్రారంభించి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.