వినియోగదారుల హక్కుల ఉద్యమనేత నరెడ్ల

జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం ఒక లక్ష్యం కలిగి ఉండటం అన్న మహానీయుడు గోర్కి మాటలు లోక్​సత్తా శ్రీనివాస్ విషయంలో అక్షరసత్యాలు. సమాజంలో జరుగుతున్న మోసాలను ప్రభుత్వం కల్పించిన ఉత్తర్వులతోనే న్యాయం చేసి వినియోగదారులకు ధైర్యాన్ని ప్రసాదించిన వ్యక్తి నరెడ్ల శ్రీనివాస్. 40 ఏండ్లుగా వినియోగదారుల ఉద్యమానికి, ప్రజలే ప్రభువులు అని నమ్మే లోక్​సత్తా ఉద్యమ సంస్థకు వెన్నుదన్నుగా నిలిచి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిన లోక్​సత్తా శ్రీనివాస్ అలియాస్ నరెడ్ల శ్రీనివాస్ లేరనే విషయం తలచుకుంటే ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతుంది. సామాన్యులకు అసామాన్యమైన న్యాయం వరించేలా చేసిన ఘనత ఆయనకే చెందుతుంది.

వినియోగదారుల ఆత్మబంధువు

కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ నిర్వహణలో, సమాచారహక్కు చట్టం, కరీంనగర్ సహరక్షణ వేదికల్లో నరెడ్ల శ్రీనివాస్ ​క్రియాశీల పాత్ర పోషించి పలువురి ప్రశంసలు పొందారు. వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలపై పొరాడటమే తప్ప వ్యక్తులపై కాదు, జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చాలన్న తపన ఉన్న వ్యక్తి ఆయన. పోలీస్, రెవెన్యూ, ప్రభుత్వసంస్థలు సరిగ్గా పనిచేయకపోయినా, అవినీతి, అక్రమాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేవారు. ఓ సందర్భంలో రోడ్డుపై ఉన్న ఒక వృద్ధురాలి భర్తను చూసి చలించిపోయి మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం స్పందించింది.

మహబూబ్ నగర్ లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి ఎంతో మందికి న్యాయం చేశారు. రాజీవ్ స్వగృహలో డిపాజిట్​ చేసిన వందలాది మందికి డబ్బులు ఇప్పించి, వారికి వడ్డీ కూడా చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి బాధితులందరికీ డిపాజిట్ డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. వినియోగదారుల చైతన్యం కోసం నిరంతరం పరితపిస్తూ, ఉన్నత పాఠశాలల్లో, కాలేజీల్లో ఎన్నో సమావేశాలు నిర్వహించేవారు. సమాచార హక్కు రక్షణ వేదిక, ఎన్నికల నిఘావేదిక, లాంటివి ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేశారు. మంచి వక్తగా, ఉత్తమ వ్యాఖ్యాతగా శ్రీనివాస్ ఎన్నో సభలు, సమావేశాలను సక్సెస్​చేశారు. జన విజ్ఞాన వేదిక లాంటి సమావేశాలకు వెళ్లి వారిని ప్రోత్సహించేవారు. 

సామాజిక దృక్పథం..

అభ్యుదయ భావజాలం, సమాజం పట్ల చిత్తశుద్ధి, సమస్యలను పరిష్కరించడంలో శ్రీనివాస్​ చొరవ స్ఫూర్తిదాయకంగా ఉండేది. ఎంపీగా పని చేసిన జువ్వాది చొక్కారావు, చల్మెడ ఆనందరావు లాంటి ఎందరో రాజకీయ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రీనివాస్ సలహాలు, సూచనలు తీసుకునేది. ఎందరో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు ఆయన మాటలతో స్ఫూర్తిపొందేవారు. విభిన్న ధ్రువాల నాయకులు, వ్యక్తులు ఎంత చర్చించినా, ఎవరినీ కించపరచని గొప్ప వ్యక్తిత్వం శ్రీనివాస్ ది. విద్యార్థి దశలోనే జన సాహితి సంస్థలో సభ్యులుగా ఉండి అభ్యుదయ భావాలను పుణికిపుచ్చుకున్నారు. జర్నలిస్టుగా, కాలమిస్టుగా జీవగడ్డ, ఉదయం, ఈనాడు, అక్షర ఉజ్వల తదితర పత్రికల్లో శ్రీనివాస్​ పనిచేశారు.

నెహ్రూయువ కేంద్రంలో ఎన్నో యువజన కార్యక్రమాలు నిర్వహించి యువతకు మార్గదర్శనం చేశారు. కరీంనగర్ ఫిల్మ్ సొసైటీని చైతన్యవంతం చేసి ప్రభుత్వం స్థలం ఇప్పించడమే కాకుండా, సొంత భవనాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. దేశంలోనే సొంత ప్రొజెక్టర్ ఉన్న ఏకైక ఫిల్మ్ సొసైటీగా పేరు రావడం వెనుక శ్రీనివాస్ అలుపెరుగని పోరాటం ఉందనడంలో అతిశయోక్తిలేదు. ఏ వ్యక్తి అయినా రిటైర్ అయిన తరువాత ప్రశాంత జీవనం గడపాలని ఆశిస్తారు. శ్రీనివాస్ అలియాస్ సీనన్న మాత్రం లోకసత్తా, వినియోగదారుల మండలి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అవినీతి అంటే సహించని ఆయన అవినీతిపరులను పట్టించే పౌరులను సన్మానించేవారు. సాహితి గౌతమి, బాల వికాస సమితి, వృక్షమిత్ర నెహ్రూ యువ కేంద్రం లాంటి సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండి, సమాజం కోసం విశేషంగా కృషి చేశారు. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో దాని బారినపడి ఆయన కాలం చేయడం వినియోగదారుల ఉద్యమానికి తీరనిలోటు. శ్రీనివాస్​ చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి.

- సింహారాజు దామోదర్, కరీంనగర్