రాళ్లను సైతం పాణమున్న మనుషుల్లాగా ప్రేమించి వాటిని కాపాడడానికి ఉద్యమించిన చరిత్రకారుడు, రచయిత, ప్రజల మన్ననలు అందుకున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ మరణం హైదరాబాద్ చరిత్రకు తీరని లోటు. తన 88వ యేట అంటే జనవరి 19న తుదిశ్వాస విడిచిన లూథర్ హైదరాబాద్‌తో గత 65 యేండ్లుగా మమేకమయిండు. తాను చిన్నప్పుడు చదువుకున్న లాహోర్ సంస్కృతి, భాష హైదరాబాద్ లో మళ్లీ చూసుకున్నాడు. అందుకే హైదరాబాద్ లో సాహిత్య, చారిత్రక కార్యక్రమాలను వివిధ సంస్థల ద్వారా నిర్వహించిండు. దగ్గరి మిత్రుడు మఖ్దూమ్ మొహియుద్దీన్ సాహచర్యంతో హైదరాబాద్‌లో అనేక ఉర్దూ సాహిత్య కార్యక్రమాలను నిర్వహించిండు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా ఉంటూ నగరంలోని ప్రసిద్ధ కట్టడాలను పరిరక్షించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నడు. అంతేకాదు తాను స్వయంగా ‘సేవ్ రాక్ సొసైటీ’ని ఏర్పాటు చేసి హైదరాబాద్ చుట్టుపక్కల గుట్టలను కాపాడేందుకు ఉద్యమాన్నే నడిపిండు. బంజారాహిల్స్ లోని తన ఇల్లు ‘విస్ఫర్ వాలీ’లో గుట్టలను తొలవకుండా రక్షిస్తూ వాటి చుట్టూ భవన నిర్మాణాన్ని చేపట్టి తాను చెప్పింది ఆచరించి చూపించిండు.
హైదరాబాద్‌తోనే ఆయన జ్ఞాపకాలు
హైదరాబాద్ నరేంద్ర లూథర్కు ఆత్మ లాంటిది. అందుకే ఆయన జ్ఞాపకాలను సీనియర్ జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి ‘హవ్ హమ్ హైదరాబాదీ’పేరిట పుస్తకంగా వెలువరించిండు. అంతకు ముందు నరేంద్ర లూథర్ తన జీవిత చరిత్రను ఇంగ్లిష్‌లో ‘ఎ బొన్సాయి ట్రీ’పేరిట ప్రకటించిండు. ఇందులో తన జీవితంలోని ఒడిదొడుకులను వివరించిండు. తాగుడుకు బానిసైన కొడుకుని ఎట్లా కాపాడుకున్నదీ, తన కూతురు బుద్ధిజాన్ని ఎందుకు, ఎట్లాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది అని అనేక విషయాలను రాసిండు. సీనియర్ సివిల్ సర్వెంట్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీగా ఎట్లా సంతృప్తిగా గడిపిందీ కూడా ఇందులో రాసిండు.
ఆయన రాసిన పుస్తకాలే ప్రామాణికం
హైదరాబాద్ చరిత్రపై లూథర్ రాసిన పుస్తకాలే ఇప్పటికీ ప్రామాణికం. ఎందుకంటే ఆయన ఒరిజినల్ పర్షియన్, ఉర్దూ సోర్సెస్ ఆధారంగా చరిత్రను నిర్మిస్తూ వచ్చిండు. అరుదైన ఆధారాలను ఆయన ఎంతో కష్టపడి సేకరించిండు. అధికారిగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే గాకుండా లిబియా లాంటి దేశాల్లో కూడా తన సేవలందించిండు. యూనిసెఫ్ సంస్థ తరఫున కూడా కొన్ని బాధ్యతలను నిర్వర్తించిండు. ఎన్ని చేసినా ఆయనకు హైదరాబాద్ అంటే ఎడతెగని మమకారం. ముల్కీ ఉద్యమాన్ని సైతం దగ్గరి నుంచి చూసిన వాడు కావడంతో తన రచనల్లో తరచూ ఈ ముల్కీకి సంబంధించిన వివరాలు ప్రస్తావిస్తూ వచ్చిండు.
హెరిటేజ్ హోదా కోసం తపన
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ‘హిస్టరీ సొసైటీ’తరఫున మేము చేపట్టిన కార్యక్రమాలకు కూడా ఆయన సహాయ సహకారాలు అందించిండు. వివిధ పత్రికల్లో ఆయన హైదరాబాద్ చరిత్రపై ప్రామాణికమైన వ్యాసాలను వెలువరించిండు. వాటిలో కొన్ని ఇంకా అముద్రితంగానే ఉన్నాయి. అవన్నీ పుస్తక రూపంలోకి వచ్చినట్లయితే ఎంతో విశిష్టమైన హైదరాబాద్ సాహిత్య, సామాజిక చరిత్ర వెలుగులోకి వస్తుంది. హైదరాబాద్ తెహజీబ్ లో భాగమైన ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్ భాషలను ప్రేమించి వాటి ప్రచారానికి, ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో హెరిటేజ్ హెూదా సాధించుకోవాలని లూథర్ తపించేవాడు. ఒక చరిత్రకారుడిగా, రచయితగా, నవలాకారుడిగా, కవిగా నరేంద్ర లూథర్ హైదరాబాద్ కేంద్రంగా చేసిన సేవ చిరస్మరణీయమైనది. ఎక్కడో పాకిస్తాన్లో పుట్టి దేశ విభజన కాలంలో పంజాబ్ లో స్థిరపడ్డ ఈయన హైదరాబాద్ ను తన శాశ్వత మకాంగా మలుచుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికక్కడ కరీంనగర్ బొమ్మలగుట్ట దగ్గర నుంచి బంజారా హిల్స్ వరకూ అన్ని గుట్టలను కాంట్రాక్టర్లు గుటకాయ స్వాహా చేస్తున్న తరుణంలో వాటిని కాపాడడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.
జంట నగరాల ఆత్మకథ రాసిండు
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల ఆత్మకథలను రాయడమే గాకుండా చరిత్ర లోతుల్లోకి వెళ్లి ఆనాటి వ్యక్తుల జీవితాలను చిత్రిక గట్టిండు. ఇట్లాంటిదే హైదరాబాద్ నగరానికి నాలుగు వందల యేండ్ల సందర్భంలో రాసిన కులీకుతుబ్ షా జీవిత చరిత్ర. అసఫ్‌జాహీ చివరి ఇద్దరి రాజుల ఆస్థాన ఫొటోగ్రాఫర్ రాజా దీన్‌దయాల్ జీవిత చరిత్రను, ఆయన చిత్రాలను కాఫీ టేబుల్ బుక్ గా వెలువరించిండు. స్వయంగా ఉర్దూ ప్రేమికుడైన లూథర్కు పర్షియన్ భాష కూడా బాగా వచ్చేది. దీంతో ఆయన కులీ కుతుబ్ షా సాహిత్యాన్ని, రచనలను అధ్యయనం చేసి రాజు, ప్రేమికుడు, హైదరాబాద్ నగర నిర్మాతగా ఆయన్ని కొనియాడుతూ పుస్తకాన్ని రాసిండు. హైదరాబాద్ నగర స్థాపకుడి గురించి ఇప్పటి వరకు వెలువడిన ప్రామాణిక పుస్తకాల్లో ఇదే ప్రధానమైనది.
ప్రాణాలకు తెగించి సర్వీస్
కవి, రచయిత, చరిత్రకారుడు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇలా ప్రతి దానిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి నరేంద్ర లూథర్. 1932 మార్చి 23న పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్‌పూర్‌లో పుట్టిండు. అయితే దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం భారత్‌లోకి వచ్చేసింది. ఉన్నత చదువులు చదివి ఐఏఎస్‌గా ఎదిగినడు. పంజాబ్ యూనివర్సిటీలో చదువుకునే టైమ్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆయన సీనియర్. 1955లో ఐఏఎస్‌గా సర్వీస్‌లో చేరిన నరేంద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిండు. 1955లో కెరీయర్ మొదలుపెట్టిన ఆయన ఏపీ చీఫ్ సెక్రటరీ హోదాలో 1991లో రిటైర్ అయ్యిండు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిండు. ఏపీలోని గూడూరు డివిజన్ సబ్‌కలెక్టర్‌గా పని చేసిన టైమ్‌లో నెల్లూరు జిల్లాపై తుపాను బీభత్సం సృష్టించింది. నాయుడుపేట, సూళ్లూరుపేటల్లో రెండు రైళ్లు తుపానులో చిక్కుకుపోయినయ్. నేషనల్ హైవేపై నడుములోతు నీళ్లు పారుతుండటంతో వైహికల్స్ ఏవీ వెళ్లలేకపోయినా.. నరేంద్ర లూథర్ ప్రాణాలకు తెగించి ఆ వరదలో ఈదుకుంటూ వెళ్లి ప్రయాణికులకు ఆహారం, పునరావాస ఏర్పాట్లు చేసిండు. సర్వీస్‌లో ఎక్కువ కాలం హైదరాబాద్‌లో పని చేసిన నరేంద్ర లూథర్ ఇక్కడి ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఉర్దూ భాషపై మక్కువ పెంచుకున్నడు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల చరిత్ర, సంస్కృతిపై పలు పుస్తకాలు రాసిండు. ఆయన రాసిన ‘హైదరాబాద్–ఏ బయోగ్రఫీ’, లష్కర్–ది స్టోరీ ఆఫ్ సికింద్రాబాద్, ‘పోయెట్’, లవర్, బిల్డర్, మహ్మద్ అలీ కుతుబ్‌షా–ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ పుస్తకాలు చాలా ఫేమస్ అయినయ్. హైదరాబాద్ శిలల విశిష్టతపై ‘రాక్యుమెంటరీ’ పేరుతో డాక్యుమెంటరీ కూడా తీసిండు. దేశ విభజన సమయంలో తన కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు, లాహోర్ నుంచి పంజాబ్‌కు ప్రత్యేక రైలు ప్రయాణంలో ఎదురైన అనుభవాలతో ‘ది ఫ్యామిలీ సాగా’ పేరుతో నవల పబ్లిష్ చేసిండు.
– సంగిశెట్టి శ్రీనివాస్,చరిత్రకారుడు
హైదరాబాద్ చరిత్ర ఆయన ఆత్మ
- వెలుగు ఓపెన్ పేజ్
- January 21, 2021
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్‌కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?