కార్పొరేట్ స్థాయి సర్కారు బడులు తెచ్చే పీఎం శ్రీ పథకం 

ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్ ప్రభుత్వ  పాఠశాలలకు కార్పొరేట్ సౌకర్యాలు కల్పించాలని సరికొత్త పథకాన్ని ప్రకటించింది. అదే పీఎం శ్రీ (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం. ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా- పీఎం శ్రీ యోజన కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేసి, అప్‌‌గ్రేడ్ చేస్తారు. ల్యాబ్‌‌లు, స్మార్ట్ క్లాస్‌‌రూమ్‌‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలు సహా ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. తాజా స్కీమ్‌‌తో పాఠశాలలు న్యూ ఎడ్యుకేషన్‌‌ పాలసీ విధానం స్ఫూర్తితో మోడల్ పాఠశాలలుగా మారుతాయి. 2022-–23 సంవత్సరం నుంచి 2026 వరకు ఐదు సంవత్సరాల కాలానికి మొత్తం 27,360 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో అమలు చేయబడుతుంది. 18 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఉంటారని భావిస్తున్నారు.

దరఖాస్తుకు  మార్గదర్శకాలు

దరఖాస్తు చేసే బడికి పటిష్ఠమైన పక్కా సొంత భవనం కలిగి ఉండాలి. పాఠశాలలో ఫైర్‌‌ సేఫ్టీ ఉపకరణాలు ఉండాలి. స్కూల్‌‌లో రాష్ట్ర సగటు కన్నా మించి స్టూడెంట్‌‌ ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ ఉండాలి. బాల బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల వసతి కలిగి ఉండాలి. కనీసం ఒక ప్రత్యేక టాయిలెట్‌‌ తప్పనిసరి. బడిలో పోర్టబుల్‌‌ డ్రింకింగ్‌‌ వాటర్‌‌ సౌకర్యం ఉండాలి. బడికి వినియోగంలో ఉన్న విద్యుత్తు కనెక్షన్‌‌,విద్యుత్తు సరఫరా తప్పనిసరి. పనిచేసే టీచర్లందరికి ఫొటో గుర్తింపుకార్డులు ఉండాలి. బడిలో గ్రంథాలయం లేదా రీడింగ్‌‌ కార్నర్‌‌, ఆటవస్తువులు తప్పనిసరి. పాఠశాలల దరఖాస్తుకు ముందు పాఠశాల ముందు, వెనుక భాగం ఫోటోలు,గ్రామాల్లోనైతే సర్పంచ్,మునిసిపాలిటీల్లోనైతే చైర్​పర్సన్ ధ్రువీకరణ పత్రం జరపరచాలి. ప్రతీ మండలంలో ఎంఈవో, ఇద్దరు జీహెచ్ఎంల బృందం పీఎం శ్రీ పథకానికి ప్రాథమికంగా ఎంపిక చేసిన పాఠశాలలను సందర్శిస్తారు. యూడైస్ ప్లస్ లో  డీఈవో కార్యాలయంలో నమోదైన సమాచారంతో పోల్చి చూస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు 60 శాతం, పట్టణ ప్రాంత పాఠశాలలకు 70 శాతం కనీస మార్కులు వచ్చిన వాటినే ఎంపిక చేస్తారు. ఎంపికైన పాఠశాలలను థర్డ్ పార్టీ ఏజెన్సీ ప్రతినిధులు సందర్శించి ఆమోద ముద్ర వేసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.

ఎంపిక ప్రక్రియ

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇందు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల నిర్వహణలోని స్కూళ్లు ఇందుకు అర్హత కలిగి ఉంటాయి. మూడంచెల ప్రక్రియ ద్వారా పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆయా పాఠశాలలే నిర్దేశించిన ఫార్మాట్ లో సంబంధిత వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలల ఎంపిక ‘ఛాలెంజ్ మోడ్’ ద్వారా జరుగుతుంది.ఇందులో పాఠశాలలు ఆదర్శవంతమైన పాఠశాలలుగా మారడానికి మద్దతు కోసం పోటీపడతాయి. పాఠశాలలు ఆన్‌‌లైన్ పోర్టల్‌‌లో స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. పథకం యొక్క మొదటి రెండు సంవత్సరాలలో ప్రతి త్రైమాసికానికి ఒకసారి, సంవత్సరానికి నాలుగు సార్లు పోర్టల్ తెరవబడుతుంది.

ఎంపిక అనంతరం ఈ పాఠశాలలను జియో ట్యాగింగ్ చేసి, ఆయా స్కూళ్లలోని కార్యకలాపాలు  సమీక్షిస్తారు. జియో-ట్యాగింగ్, ఇతర సంబంధిత పనుల కోసం భాస్కరాచార్య నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ సేవలు తీసుకోబడతాయి. పాఠశాలల తుది ఎంపిక కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తారు.

తెలంగాణ నుంచి ..

ప్రభుత్వ బడులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర విద్యాశాఖ అమలుచేస్తున్న ‘పీఎం శ్రీ స్కూల్స్‌‌’ పథకానికి తెలంగాణ నుంచి 5,973 స్కూళ్లు పోటీపడుతున్నాయి. ఆయా స్కూళ్లను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు షార్ట్‌‌లిస్ట్‌‌ చేశారు. ఈ పథకంలో భాగంగా మండలానికి రెండు చొప్పున 1,204 స్కూళ్లు ఎంపికయ్యే అవకాశముంది. రాష్ట్రం నుంచి ప్రభుత్వ స్కూల్స్‌‌తోపాటు కేంద్రీయ,   విద్యాలయాలు కూడా ఈ పథకం కోసం పోటీపడనున్నాయి. ఎంపికైన ఒక్కో పాఠశాలకు సుమారు రూ.2 కోట్ల వరకు నిధులు మంజూరు కానున్నాయి. ఏడాదికి రూ.40 లక్షల వంతున ఐదేళ్ల పాటు విడుదల అవుతాయి.

కార్పొరేట్ హంగులు

జిల్లా కమిటీ ఎంపిక చేసిన పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి హంగులు సమకూర్చనున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన జరిగేలా చర్యలు తీసుకుంటారు. విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉంచుతారు. ప్రయోగశాల,డిజిటల్ గ్రంథాలయం, ఇంటర్నెట్ కనెక్షన్, వృత్తి విద్య కోర్సుల అమలు, క్రీడా సామగ్రి, సౌర విద్యుత్తుకు ప్యానెళ్లు, ప్లాస్టిక్ రహితంగా మార్చడం, నాణ్యమైన విద్య అందించడం తదితర అంశాలను అందుబాటులోకి తీసుకు రానున్నారు. స్కూళ్లను పర్యావరణ అనుకూల గ్రీన్ స్కూల్స్ గా మార్చాల్సి ఉంటుంది. పాఠశాలలో ఎల్ ఈడీ లైట్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి స్వయంగా సేంద్రీయంగా కూరగాయలు, ఆకుకూరలు పండించాలి. గుజరాత్ లోని విద్యా సమీక్ష కేంద్రం ఈ పథకాన్ని సమీక్షిస్తుంది. నాణ్యమైన బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి మాత్రమే కాక, 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలతో వారిని తీర్చిదిద్దడం కూడా ఈ పాఠశాలల ముఖ్య లక్ష్యం.