త్వరగా కోలుకోవాలి.. షమీ సర్జరీపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

త్వరగా కోలుకోవాలి.. షమీ సర్జరీపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

వరల్డ్ కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన మహమ్మద్ షమీ మళ్లీ ఫీల్డ్ లో కనిపించలేదు. తాజాగా ఇప్పుడతడు తన మడమ గాయానికి సర్జరీ చేయించుకున్నట్లు వెల్లడించాడు. తాను హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోలను అతడు సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేశాడు. ఈ సర్జరీతో అతడు ఐపీఎల్ 2024 మొత్తానికి దూరం కానున్నాడు. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ షమీ గాయంపై స్పందించారు.   

గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని ఆకాంక్షించారు. షమీ వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకొని దేశం తరపున ఆడతాడని ఆయన నమ్మకముంచారు. మహ్మద్ షమి గతేడాది వరల్డ్ కప్ లో 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురైన షమి.. సుమారు మూడున్నర నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్ లకు దూరమయ్యాడు.

ALSO READ :- Amar Singh Chamkila: దేశాన్ని ఊపేసిన చమ్కీలా బయోపిక్.. OTTకి వచ్చేస్తోంది

గాయం ఎంతకీ మానకపోవడంతో సర్జరీ తప్పదన్న నేషనల్ క్రికెట్ అకాడెమీ ఫిజియోల సూచన మేరకు షమి.. తాజాగా మడమకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ సర్జరీతో అతడు ఐపీఎల్ 2024 మొత్తానికి దూరమయ్యాడు. దీంతో గుజరాత్ టైటన్స్ కు గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే వాళ్ల కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు వెళ్లిపోయాడు. మరోవైపు ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ కు షమీ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.