మోదీ గొప్ప ప్రధాని.. ప్రజలకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు : వివేక్ వెంకటస్వామి

ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని ఆ పనులు చేసే గొప్ప ప్రధాని నరేంద్ర మోదీ అని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎయిర్ పోర్టు లాగే రైల్వే స్టేషన్లు ఉండాలని లక్షల కోట్ల నిధులను రైల్వే శాఖకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు.  అమృత్ భారత్ రైల్వే స్టేషన్ లలో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.  

అమృత్ భారత్ పధకం కింద రూ. 24.50 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రామగుండం  రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఆయన హాజరయ్యారు.  ఈ సందర్భంగా రామగుండం రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు  వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.  

రైల్వే నెట్ వర్క్ విస్తరణకు కేంద్రం అధిక ప్రాధాన్యత  ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమృత్ భారత్ పధకం కింద రూ.25 వేల కోట్ల నిధులతో దేశంలోని 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి వర్చువల్ గా 2023 ఆగస్టు 06న  మోదీ శంకుస్థాపన చేశారు. దేశ రైల్వే రంగంలో ఇవాళ  చరిత్రలో నిలిచిపోయే రోజని ఆయన అభిప్రాయయపడ్డారు. 

రైల్వేలో  మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించామని మోదీ చెప్పుకొచ్చారు.  ఈ ఏడాది బడ్జెట్ లో రైల్వే శాఖకు ఎక్కువగా నిధులు కేటాయించామని వెల్లడించారు. సామాన్యుల కోసమే రైల్వే అభివృద్ధి చేస్తున్నామని మోదీ తెలిపారు.   గత 9 ఏళ్లుగా రైల్వే లైన్లను విస్తరించామని చెప్పుకొచ్చారు.  అమృత్ భారత్ పధకం కింద తెలంగాణ రూ.894.09 కోట్లతో 21 స్టేషన్లు, ఏపీలో 453.50 కోట్లతో 18 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.