- భారత ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకొచ్చిన ఘనత ఆయనదే
- చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చిన మహనీయుడు
- మోదీ అంటే విశ్వాసం.. కేసీఆర్ అంటే మోసం: రఘునందన్ రావు
మంచిర్యాల, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే గొప్ప లీడర్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకొచ్చిన ఘనత ఆయనదే అని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చిన మహనీయుడు మోదీ అని కొనియాడారు. కరోనా నుంచి ఇప్పటివరకు పేదల ఆకలి తీర్చేందుకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాలలోని ఆర్‌బీహెచ్‌వీ గ్రౌండ్‌లో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వివేక్‌తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వివేక్ మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెరబెల్లి రఘునాథ్ రావును ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. రఘునాథ్ రావు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తారని పేర్కొన్నారు.
కేసీఆర్ మోసాలు రాస్తే రామాయణమంతా: రఘునందన్ రావు
‘ప్రధాని మోదీ అంటే విశ్వాసం.. సీఎం కేసీఆర్ అంటే మోసం’అని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. కేసీఆర్ మోసాలు రాస్తే రామాయణమంతా.. చెబితే భాగవతమంతా అని ఎద్దేవా చేశారు. ‘మోదీ అంటే అమ్మకం.. కేసీఆర్ అంటే నమ్మకం’అంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు ఈ సందర్భంగా రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఘనత ప్రధాని మోదీది అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి రాగానే మోసం చేశారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి సింగరేణిలో ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారన్నారు. తెలంగాణ వచ్చాక ఓపెన్ కాస్ట్‌లు ఉండవని చెప్పి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తన ధర్నాకు భయపడి మహిళా బిల్లును తెచ్చిందని ఎమ్మెల్సీ కవిత చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దమ్ముంటే మీ నాయన కేసీఆర్‌తో కొట్లాడి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 50 సీట్లు ఇప్పించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.
రేవంత్‌ను కాపాడుతున్న కేసీఆర్..
బీజేపీ మీటింగ్‌కు బీఆర్ఎస్ వాళ్లు జనాలను పంపించారని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటని రఘునందన్ రావు మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌ను కోర్టు మెట్లు ఎక్కకుండా కేసీఆర్ కాపాడుతున్నారన్నారు. రేవంత్, కవిత ఇద్దరు వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉండటం వల్లే ఆయనపై కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రి అవుతారని రఘునందన్ రావు అన్నారు. కోల్ బెల్ట్ ఏరియాతో కాకా వెంకటస్వామి కుటుంబానికి ఎనలేని అనుంబంధం ఉందన్నారు. రఘునాథ్ రావు మాట్లాడుతూ, పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే నాయకుడు వివేక్ అని అన్నారు. 6,400 కోట్లతో రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన ఘనత వివేక్‌కు దక్కుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఏ రైలు ఆగాలన్నా.. హైవేలు రావాలన్నా వివేక్‌తోనే సాధ్యమవుతుందన్నారు.