మహాత్మా గాంధీ, వాజ్‌పేయికి మోదీ నివాళులు

 మహాత్మా గాంధీ, వాజ్‌పేయికి  మోదీ నివాళులు

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరగనున్న కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. పలువురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.  అయితే ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి, ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ యుద్ధ స్మారకం వద్దకు వెళ్లి పుష్పగుచ్ఛం ఉంచారు. 

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ పాలసీ, ‘సాగర్’ విజన్ లో భాగంగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్, మాల్దీవ్స్ దేశాధినేతలను ఆహ్వానించారు. ఢిల్లీకి వచ్చే వీరందరికీ తగిన ఆతిథ్యం ఇవ్వడంతోపాటు రాకపోకల సందర్భంగా పటిష్టమైన భద్రతను కల్పించనున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫిఫ్ ఇదివరకే ఢిల్లీకి చేరుకున్నారు. 

ఇక శ్రీలంక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజ్జు, మారిషస్ పీఎం ప్రవింద్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ పీఎం షెరింగ్ టోబ్గే కూడా మోదీ ప్రమాణ స్వీకార వేడుకలకు హాజరుకానున్నారు. కాగా, మోదీ 2014లో మొదటిసారి ప్రధానిగా ప్రమాణం చేసిన సందర్భంగా సార్క్ దేశాల అధినేతలను, రెండోసారి 2019లో ప్రమాణం చేసిన సందర్భంగా బిమ్ స్టెక్ దేశాల అధినేతలను ఆహ్వానించారు.