పవన్‌ కల్యాణ్ అంటే ఒక సునామీ : నరేంద్ర మోదీ

ఎన్డీఏ ఎంపీల సమావేశంలో జనసేన చీఫ్  పవన్‌ కల్యాణ్‌ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు  నరేంద్ర మోదీ.  మన సమక్షంలోనే పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు.. పవన్‌ కల్యాణ్ అంటే ఒక సునామీ.. పవన్‌ అంటే పవనం కాదు.. ఒక సునామీ అంటూ కొనియాడారు.  ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని చెప్పారు.  చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మిక విజయాన్ని సొంతం చేసుకున్నామని తెలిపారు.  

పవన్ వల్లే ఏపీలో భారీ విజయం సాధ్యమైందని చెప్పారు మోదీ.  ఏపీ విజయం సామాన్యుడి ఆకాంక్షల ప్రతిరూపమన్నారు.  అటు కర్ణాటక, తెలంగాణలో ఎన్డీఏను  ప్రజలు ఆదరించారని మోదీ చెప్పుకొచ్చారు.  తమిళనాడులో తమకు సీట్లు రాకపోవచ్చు కానీ ఓటింగ్ శాతం పెరిగిందని వెల్లడించారు.   దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నామని చెప్పారు. 

మరోవైపు  మోదీ ప్రధానిగా ఉన్నంతవరకు ఏ దేశానికి భారత్‌ తలొగ్గదన్నారు పవన్‌ కల్యాణ్‌.  విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.  కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని..  మోదీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని తెలిపారు పవన్.