- ఫామ్‌హౌస్ సీఎం అవసరమా?: ప్రధాని మోదీ
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కార్బన్ కాపీలు.. అంబేద్కర్‌ను ఆ రెండు పార్టీలు అవమానించినయ్
- దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ ట్రైలర్ చూశారు.. అసలు సినిమా ముందుంది
- రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా
- నిర్మల్, తూప్రాన్ సభల్లో ప్రసంగం
తూప్రాన్/ నిర్మల్, వెలుగు: లిక్కర్ స్కామ్‌లో ఉన్నోళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తెలంగాణను కేసీఆర్ బర్బాద్ చేసి దేశ్ కీ నేత కావాలని ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ప్రజలను కలవని, సచివాలయానికి రాని సీఎం అవసరమా? ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యే సీఎం అవసరమా? ఈ ఎన్నికలతో ఆయనను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలి” అని అన్నారు. ధరణి పేరుతో భూమాఫియాను కేసీఆర్ కొనసాగించారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ధరణి స్థానంలో ‘మీ భూమి’ పోర్టల్ తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలో సుల్తాన్ తరహా పాలన చేసిందని, తెలంగాణలో కేసీఆర్ నిజాం తరహా పాలన కొనసాగించారని, నిజాం వారసులను కేసీఆర్ పోషిస్తున్నారని విమర్శించారు. ఆదివారం నిర్మల్, మెదక్ జిల్లా తూప్రాన్‌లో నిర్వహించిన బీజేపీ సకలజనుల విజయ సంకల్ప సభల్లో ప్రధాని ప్రసంగించారు. ‘‘లిక్కర్ స్కామ్‌లో ఉన్నవారిని జైలుకు పంపడం గ్యారంటీ.. ఢిల్లీలోని కట్టర్ పార్టీ, తెలంగాణలోని కరప్ట్ పార్టీ చేతులు కలిపినయ్.
బీఆర్ఎస్, కాంగ్రెస్.. కార్బన్ కాపీలు.. కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటూ బీఆర్ఎస్ కు పోతుంది. ఇదే జరిగితే అవినీతి, అక్రమాలు, కుటుంబాల పాలనకు ఆ ఓటు పడినట్లే’’ అని పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిపై విచారణ ఎదుర్కొంటున్నదని, కేసీఆరే స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు అంగీకరించారని, ఆయనది 30 శాతం కమీషన్ల సర్కార్ అని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ది అసమర్థ సర్కార్..
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణలో కూడా ప్రశ్నా పత్రాలు లీకయ్యాయని, గ్రూపు వన్ పరీక్ష కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్‌ది అని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘‘మా కొలువులు ఎక్కడని లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నరు. వాళ్లకు జవాబు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు తక్కువగా ఉంటే, తెలంగాణలో అధిక ధరలు ఉన్నాయని అన్నారు.
మాదిగ సోదరులకు న్యాయం చేస్తం
మాదిగ సోదరుల సమస్యలను అర్థం చేసుకున్నది బీజేపీయేనని, వారికి న్యాయం చేసేందుకు కమిటీ వేశామని ప్రధాని మోదీ అన్నారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో సామాజిక న్యాయం జరగదని అన్నారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తానని అంబేద్కర్‌ను అవమానపరిస్తే, అంబేద్కర్‌కు భారత రత్న బిరుదు ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానించిందని మోదీ మండిపడ్డారు. గిరిజనుల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని, ఇందులో భాగంగానే గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని, 5% బడ్జెట్ పెంచిందని, గిరిజన వీరులను గుర్తించేందుకు మ్యూజియాలను, తెలంగాణలో తొలి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని చెప్పారు.
మతం పేరుతో ఐటీ పార్కులా..?
బీజేపీ ప్రభుత్వం ఫుడ్ పార్క్, టెక్స్ టైల్ పార్క్, టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేస్తుంటే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం మతం పేరుతో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే మరో ఐదేండ్ల పాటు పేదలందరికీ ఉచిత బియ్యంతో పాటు ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు.
కేసీఆర్‌కు ఆయన కుటుంబ భవిష్యత్తే ముఖ్యం
రాష్ట్రంలో ఫామ్‌హౌస్ ప్రభుత్వం నడుస్తున్నదని ప్రధాని మోదీ విమర్శించారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని దుయ్యబట్టారు. ‘‘కేసీఆర్ తనకు తాను తీస్మార్ ఖాన్, రాజకీయ జ్ఞాని అనుకుంటున్నడు. కేసీఆర్‌కు మన పిల్లల భవిష్యత్ పట్టదు. కేవలం ఆయన పిల్లలు, కుటుంబ భవిష్యత్తే అవసరం” అని మండిపడ్డారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ ట్రైలర్ చూశారని, అసలు సినిమా ముందుందని చెప్పారు. ప్రపంచమంతా మేక్ ఇన్ ఇండియాను గౌరవిస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం మేక్ ఇన్ ఇండియా పేరు ఎత్తేందుకు వెనుకాడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో భగవంతుని పేరుతో ప్రాజెక్టులు కట్టి రైతులను ముంచడం బాధాకరమని అన్నారు. ప్రజల ఆదాయం పెంచుతామని కేసీఆర్ చెప్పి సొంత కుటుంబ ఆదాయం పెంచుకున్నారని మండిపడ్డారు.
నిజామాబాద్‌ను టర్మరిక్ సిటీగా మారుస్తం
బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని చెప్పారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ లో నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే నిజామాబాద్ ను టర్మరిక్ సిటీగా మారుస్తామని, ఆర్మూర్ పసుపుకు జియోట్యాగ్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఐదేండ్లు తెలంగాణకు ఎంతో ముఖ్యమని, 2024 తర్వాత మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ ఏర్పడితే డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మొబైల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి బీజేపీకి మద్దతు తెలిపాలని ఆయన కోరారు.
నిర్మల్ కొయ్య బొమ్మలకు మంచి రోజులు తెస్తా..
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమను సర్వ నాశనం చేశాయని, ప్రస్తుతం ఈ పరిశ్రమ పరిస్థితి దయనీయంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొయ్య బొమ్మల ఎగుమతికి చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే కొయ్య బొమ్మల పరిశ్రమకు పూర్వ వైభవం తెస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని ఆయన ప్రకటించారు. తనకు కొమురంభీం, రాంజీ గోండు ప్రేరణ కల్పిస్తున్నారని అన్నారు. మోదీ పలుసార్లు తన ప్రసంగాన్ని తెలుగులో కూడా కొనసాగించారు. సభల్లో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, నిర్మల్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ అభ్యర్థి రాథోడ్ రమేశ్, ఆదిలాబాద్ అభ్యర్థి పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.