ప్రధానిగా మూడోసారి ... ఇయ్యాల్నే మోదీ ప్రమాణ స్వీకారం

ప్రధానిగా మూడోసారి ...  ఇయ్యాల్నే మోదీ  ప్రమాణ స్వీకారం

 

  • సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి ముర్ము సమక్షంలో కార్యక్రమం 
  • ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న మోదీ 
  • ఆయనతోపాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం 
  • టీడీపీకి 4.. జేడీయూకు 2 మంత్రి పదవులు 
  • కీలక శాఖలు మాత్రం బీజేపీ వద్దే 
  • ఢిల్లీలో హైఅలర్ట్.. మూడంచెల్లో గట్టి బందోబస్తు 
  • ఏడు పొరుగు దేశాల అధినేతలకు ఆహ్వానం

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరగనున్న కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. పలువురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో నేతగా మోదీ నిలిచారు. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ చుట్టూ మూడంచెల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వేదిక వద్ద, ఇతర వ్యూహాత్మక ప్రాంతాల్లో ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన స్వాట్ కమాండోలతోపాటు, ఎన్ఎస్ జీ కమాండోలను మోహరించారు. ఢిల్లీని నో ఫ్లయింగ్ జోన్​గా ప్రకటించారు. డ్రోన్ లు, పారాగ్లైడింగ్​, హాట్ ఎయిర్ బెలూన్లను ఎగరేయడంపై రెండు రోజుల పాటు నిషేధం విధించారు. ఆదివారం సెంట్రల్ ఢిల్లీకి వెళ్లే కీలకమైన రోడ్లను మూసివేయనున్నారు. అలాగే అనేక చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. ఇక దేశ రాజధానిలోకి ప్రవేశించే వాహనాల తనిఖీలను పోలీసులు ఇప్పటికే ప్రారంభించారు. కార్యక్రమానికి వస్తున్న వివిధ దేశాధినేతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ (272)కు 32 సీట్లు తక్కువగా 240 సీట్లకే పరిమితమైన బీజేపీ.. ఎన్డీయేలోని ఇతర మిత్రపక్షాలకు ఉన్న మిగతా 53 మంది ఎంపీల మద్దతుతో మొత్తం 293 ఎంపీల సంఖ్యాబలంతో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో 232 సీట్లనే గెలుచుకోవడంతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది.

హాజరుకానున్న పొరుగు దేశాల అధినేతలు 

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ పాలసీ, ‘సాగర్’ విజన్ లో భాగంగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్, మాల్దీవ్స్ దేశాధినేతలను ఆహ్వానించారు. ఢిల్లీకి వచ్చే వీరందరికీ తగిన ఆతిథ్యం ఇవ్వడంతోపాటు రాకపోకల సందర్భంగా పటిష్టమైన భద్రతను కల్పించనున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫిఫ్ ఇదివరకే ఢిల్లీకి చేరుకున్నారు. ఇక శ్రీలంక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజ్జు, మారిషస్ పీఎం ప్రవింద్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ పీఎం షెరింగ్ టోబ్గే కూడా మోదీ ప్రమాణ స్వీకార వేడుకలకు హాజరుకానున్నారు. కాగా, మోదీ 2014లో మొదటిసారి ప్రధానిగా ప్రమాణం చేసిన సందర్భంగా సార్క్ దేశాల అధినేతలను, రెండోసారి 2019లో ప్రమాణం చేసిన సందర్భంగా బిమ్ స్టెక్ దేశాల అధినేతలను ఆహ్వానించారు.

మంత్రి పదవులు టీడీపీకి 4.. జేడీయూకు 2 

ఎన్డీయే సర్కారు ఏర్పాటులో కీలకంగా మారిన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ, నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూకు కేంద్ర కేబినెట్ లో తగిన ప్రాధాన్యం దక్కే అవకాశాలు ఉన్నాయి. మోదీ కొత్త కేబినెట్​లో టీడీపీకి 4, జేడీయూకు 2 మంత్రి పదవులు ఇచ్చే చాన్స్ ఉందని కూటమి వర్గాలు వెల్లడించాయి. టీడీపీ నుంచి రామ్ మోహన్ నాయుడు, హరీశ్ బాలయోగి, దగ్గుమళ్ల ప్రసాద్​కు కేంద్ర కేబినెట్​లో బెర్త్ ఖాయమైందని తెలుస్తోంది. అలాగే జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్​లకు బెర్త్ కన్ఫమ్ అయినట్టు సమాచారం. వీరిలో భారతరత్న కర్పూరి ఠాకూర్ కొడుకు రామ్​నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దీనిపై ఎన్డీయే మీటింగ్​లో తుది నిర్ణయం తీసుకున్నారని కూటమి వర్గాలు తెలిపాయి. అయితే, లోక్ సభ స్పీకర్ పదవి కూడా ఇవ్వాలని టీడీపీ కోరినట్టు తెలుస్తోంది. ఎల్జేపీ (రామ్ విలాస్) చీఫ్​ చిరాగ్ పాశ్వాన్​కు కూడా కేబినెట్​లో చోటు దక్కే అవకాశం ఉంది. కాగా, హోంశాఖ, ఫైనాన్స్, డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు, ఎడ్యుకేషన్, కల్చర్ వంటి శాఖలను మాత్రం బీజేపీ తన వద్దే ఉంచుకోనుందని తెలుస్తోంది.

నన్ను పిలవడం గౌరవంగా భావిస్తున్నా: మొయిజ్జు 

మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహ్మద్ మొయిజ్జు అన్నారు. మాల్దీవ్స్ లోని ఇండియన్ హై కమిషనర్ మును మహవర్ శనివారం మొయిజ్జును కలిసి ఇన్విటేషన్ లెటర్ ను అందజేశారు. ఈ సందర్భంగా మొయిజ్జు మాట్లాడుతూ.. భారత్ లో జరుగుతున్న చరిత్రాత్మక ఘట్టానికి తాను హాజరు కానున్నట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశగా వెళ్తున్నాయనడానికి తన పర్యటన సంకేతమని చెప్పారు.