
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో మోదీకి మొత్తం 6,12,970 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కి 4,60,457 ఓట్లు వచ్చాయి. అజయ్ రాయ్ పై మోదీ 1,52,513 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి అథర్ జమాల్ లారీ 33,766 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మిగతా అభ్యర్థులందరికీ 6 వేల లోపే ఓట్లు వచ్చాయి.
ఇక్కడ నోటాకు 8,478 ఓట్లు పడ్డాయి. అయితే, గత రెండు లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి మోదీకి మెజార్టీ భారీగా తగ్గిపోయింది. 2014లో ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ పై 3,71,784 ఓట్ల మెజార్టీతో, 2019లో ఎస్పీ అభ్యర్థి శాలినీ యాదవ్ పై 4,79,505 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఈసారి మోదీ మెజార్టీ రికార్డ్ స్థాయిలో ఉంటుందని బీజేపీ నేతలు భావించగా.. వారి అంచనాలు తలకిందులయ్యాయి.
తొలి రెండు రౌండ్లలో వెనకబడ్డ మోదీ..
బీజేపికి1991 నుంచి 9 సార్లు విజయాన్ని అందించి ఆ పార్టీకి కంచుకోటలా మారిన వారణాసి నుంచే మోదీ వరసగా మూడోసారి బరిలోకి దిగారు. బీజేపీ అగ్రనేతలతోపాటు కూటమిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఇతర నేతలు కూడా ఇక్కడ ముమ్మరంగా ప్రచారం చేశారు. అయితే, ఎన్నికల ఫలితాల సందర్భంగా మోదీకి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ చెమటలు పట్టించారు. తొలి రెండు రౌండ్లలో దాదాపు 6 వేల ఓట్లతో రాయ్ లీడ్ లో ఉన్నారు. దీంతో మోదీ గెలుపుపై పార్టీలో చర్చ మొదలైంది. తర్వాత ఒక్కో రౌండ్ లో మోదీకి ఆధిక్యం పెరుగుతూ చివరకు విజయం సాధించారు. కానీ గత ఎన్నికలతో పోలిస్తే మెజార్టీ మాత్రం సగానికిపైగా తగ్గిపోయింది.