ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళల్లో కొనసాగుతున్నాయి. ఈ ఎనిమిదేండ్లలో ఎన్నో సంస్కరణలతో మోడీ ప్రభుత్వం ‘టీం ఇండియా’ స్ఫూర్తితో సబ్కా సాత్– సబ్కా వికాస్– సబ్ కా ప్రయాస్ నినాదంతో ముందుకు వెళ్తోంది. సేవా, సుపరిపాలన, పేదరిక నిర్మూలన లక్ష్యంగా మోడీ ప్రభుత్వం కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. కరోనాతో భారత ఆర్థిక వృద్ధిని నిలిపివేసింది. ఉచిత టీకాలు, రేషన్ పంపిణీ ద్వారా మోడీ ప్రభుత్వం 135 కోట్ల భారతీయుల సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రత కోసం పని చేసింది. కరోనా కష్టకాలంలో 2020 మే12న రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పేరుతో భారీ ప్యాకేజీని ప్రకటించింది. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత ఆహార ధాన్యాలు అందజేసింది. పీఎం స్వనిధి యోజన కింద 29.6 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చింది. పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు కోట్ల ఇండ్లు కట్టి ఇచ్చింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో 11.22 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, 6.2 కోట్ల కొత్త నల్లా కనెక్షన్లు ఇచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ తో 3.2 కోట్ల మంది 5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ చేపట్టి190 కోట్ల డోసులకు పైగా ఉచిత వ్యాక్సిన్లు అందించింది. 8,727 జన ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరలకు మందులు. కేంద్ర ప్రభుత్వం గత 8 ఏండ్లలో 15 కొత్త ఏయిమ్స్, దాదాపు 200 కొత్త మెడికల్ కాలేజీలు, ప్రతి మండలంలో హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఇంకా పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద11.3 కోట్ల రైతు కుటుంబాలకు రూ.1.82 లక్షల కోట్లు అందించింది.
అన్ని రంగాల్లో మహిళలకు..
మోడీ ప్రభుత్వం విద్యారంగంలో మార్పుల కోసం ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020’ పాలసీ తీసుకొచ్చింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద1.32 కోట్ల మంది యువత శిక్షణ పొందారు. పీఎం ఉజ్వల యోజన కింద 9 కోట్ల మంది మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లు అందాయి. జన్ ధన్ ఖాతాల ద్వారా బ్యాంకులతో 25 కోట్ల మంది మహిళల అనుసంధానమ్యారు. స్టాండప్ ఇండియా కింద ఇచ్చిన రుణాల్లో 80 శాతం మహిళలు లబ్ధి పొందారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు 26 వారాలకు పెంపు, సాయుధ దళాల్లో మహిళలకు సమాన హోదా లాంటి కీలక నిర్ణయాలు మోడీ ప్రభుత్వం తీసుకుంది.
చరిత్రాత్మక నిర్ణయాలు
మోడీ సర్కారు132 కోట్లకు పైగా పౌరులకు ఆధార్ కార్డులు జారీ చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 4.46 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు, భారత్ నెట్ కింద 1.75 లక్షల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ కల్పించింది. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ అయోధ్యలో రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ ధామ్, కేదార్‌నాథ్ ధామ్ పునరుద్ధరణ. ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళలకు ఉపశమనం కల్పించేందుకు ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది మోడీ ప్రభుత్వం. పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మతపరమైన పీడనకు గురైన ఆరు మతాలకు చెందిన మైనారిటీలు దేశానికి శరణార్థులుగా వచ్చారు. వారి కోసం ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చింది. ఉరీ దాడికి ప్రతిగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు నిర్వహించింది. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యగా బాలాకోట్ పై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసింది. పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసి మోడీ కీలక దౌత్యపరమైన విజయం సాధించారు.
అన్ని వర్గాలకు న్యాయం..
స్వతంత్ర భారత దేశంలో మొదటిసారిగా 27 మంది ఓబీసీలను, దళిత సామాజిక వర్గానికి సంబంధించి 12 మందిని, 8 మంది గిరిజనలకు, 11 మంది మహిళలను, అయిదుగురు మైనార్టీలకు మోడీ కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించారు. సమాజంలో అత్యంత పేదవాడికి, చిట్ట చివరి వ్యక్తికి, మొదట న్యాయం చేయాలని దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని మోడీ అక్షరాల అమలు చేస్తున్నారు. అసాధ్యం అనుకున్న ఎన్నో న్యాయపరమైన, రాజ్యాంగపరమైన మార్పులు సుసాధ్యం చేసి చూపారు ప్రధాని నరేంద్ర మోడీ. అందుకే దేశ ప్రజలు మోడీ పట్ల అచంచలమైన విశ్వాసంతో రెండుసార్లు ఆయనను ప్రధానిని చేశారు.
భారీ స్థాయిలో మౌలిక వసతులు
దేశవ్యాప్తంగా విస్తృతమైన రోడ్ నెట్ వర్క్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఉడాన్ పథకం కింద 87 లక్షల మందికి విమాన ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, కొత్తగా ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టింది. 2021-22లో ఇండియాకు 83.57 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ముద్ర యోజన కింద కోట్లాదిమంది లబ్దిదారులకు కొన్ని లక్షల కోట్ల రూపాయల రుణ సదుపాయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ ద్వారా ఏప్రిల్ 2022లో రికార్డు స్థాయిలో రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయి.
- డా. కె. లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు