టాలీవుడ్ సీనియర్ నటులల్లో ఒకరైన నరేష్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే నటి పవిత్రను వివాహం చేసుకున్నట్టు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఆ తర్వాత అది నిజమైన పెళ్లి కాదని, కేవలం ఓ సినిమా షూటింగ్ లో భాగమని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా అవే మాటలను నిజం చేస్తూ నటి పవిత్రతో కలిసి నటించిన 'మళ్లీ పెళ్లి' అనే టైటిల్ తో మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవిత్ర వాకిట్లో ముగ్గు వేస్తుండగా, నరేష్ దాన్నికొంటెగా చూస్తూ, మోకాలిపై కూర్చొని ఉన్నారు. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన పోస్టర్, గ్లింప్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ మూవీ అప్ డేట్ పై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఇన్ని రోజులు నరేష్ పెట్టిన ఫొటోలు, పెళ్లి వీడియోలు ముందు చెప్పినట్టు సినిమా కోసమేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే ఇలా చేశారా అంటూ అవాక్కవుతున్నారు. మరో వైపు నరేష్ భార్య రమ్య రఘుపతి కూడా నరేష్, పవిత్రలపై ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ సమయంలో నరేష్, పవిత్రను పెళ్లి చేసుకున్నట్టు, హనీమూన్ కు కూడా వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను రివీల్ చేయడంతో అంతా మూవీ కోసమేనని స్పష్టమైంది.