గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతూ వస్తోన్న ఐపీఎల్ పదిహేడో సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లు ముగియగా.. నేటి నుంచి నాకౌట్ సమరం షురూ కానుంది. క్వాలిఫయర్-1లో భాగంగా మంగళవారం(మే 21) టేబుల్ టాపర్ కోల్‌కతా.. రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగు పెడుతుంది. దీంతో ఇరు జట్లూ గెలుపు కోసం తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బలాబలాల వారిగా ఏ జట్టు బాగుంది. గెలిచే అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయనేది చూద్దాం..
సీజన్ ఆసాంతం నిలకడగా రాణిస్తూ ప్లేఆఫ్స్ చేరిన ఈ రెండు జట్లలో మ్యాచ్ విన్నర్లకు కొదవలేనప్పట్టికీ.. కీలక ఆటగాడు దూరమవ్వడం కోల్‌కతాకు భారీ లోటు అని చెప్పుకోవాలి. అంతర్జాతీయ డ్యూటీ కోసం ఇంగ్లాండ్ బ్యాటర్, నైట్ రైడర్స్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ స్వదేశానికి వెళ్ళిపోయాడు. అతను లేకపోవడం కేకేఆర్‌కు భారీ దెబ్బే. ఇప్పుడు వారి ఆశలన్నీ మరో ఓపెనర్ సునీల్ నరైన్, విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌పైనే ఉన్నాయి.
విండీస్ వీరులే కోల్‌కతా బలం..
నరైన్ క్రీజులో కుదుర్కున్నాడంటే.. హైదరాబాద్ బౌలర్లు బలికాక తప్పదు. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, 3 అర్ధసెంచరీల సాయంతో 461 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ నరైన్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. అతన్ని త్వరగా ఔట్ చేస్తే మిడిలార్డర్ కూడా తడబడుతుంది. కాకపోతే నరైన్ అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ డకౌట్ కావడం వారిని కలవరపెడుతోంది. అలాగే ఆఖరిలో ఆండ్రీ రస్సెల్‌ను కట్టడి చేయాలి. రస్సెల్ ఆడేది తక్కువ బంతులే అయినా భారీ ఇన్నింగ్స్ అడగలడు. దీంతో అతని పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వీరిద్దరిని కట్టడి చేయగలిగితే కమ్మిన్స్ సేన పైచేయి సాధించినట్లే.
Sunil Narine is yet to score a run at Ahmedabad in the IPL 🤯
— Sportskeeda (@Sportskeeda) May 21, 2024
Three games, three ducks for Sunil Narine 👀#IPL2024 #SunilNarine #KKRvSRH #CricketTwitter pic.twitter.com/vslyQdgivf
ఓపెనర్లపైనే మన ఆశలు
కోల్‌కతా తరహాలో హైదరాబాద్ జట్టూ ఓపెనర్లపైనే ఆశలు పెట్టుకొని ఉంది. అభిషేక్ శర్మ (467), ట్రావిస్ హెడ్ (533 పరుగులు) రాణించడంపైనే సన్‌రైజర్స్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ జోడి 10 ఓవర్ల పాటు క్రీజులో నిల్చుంటే తప్ప కమ్మిన్స్ సేనకు అడ్వాంటేజ్ ఉండదు. వీరిద్దరి మినహా వైజాగ్ కుర్రాడు నితీశ్ రెడ్డి అంచనాలకు మించి రాణిస్తుండటం ఎస్‌ఆర్‌హెచ్‌కు అదనపు బలం. చివరలో క్లాసెన్ మెరుపులు మెరిపిస్తే హైదరాబాద్‌కు తిరుగుండదు.
తుది జట్లు:
కోల్‌కతా (అంచనా): సునీల్ నరైన్, రహ్మనుల్లా గుర్బాజ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
హైదరాబాద్ (అంచనా): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్.