అనుమతులు ఒకలా.. కట్టుకోవడం మరోలా: లోపాలను ఎత్తిచూపుతున్న ఫైర్​ యాక్సిడెంట్లు

అనుమతులు ఒకలా.. కట్టుకోవడం మరోలా: లోపాలను ఎత్తిచూపుతున్న ఫైర్​ యాక్సిడెంట్లు
  • తాజాగా పుప్పాలగూడలోని అపార్ట్​మెంట్​లో ప్రమాదం
  • ఫైరింజన్లు లోపలకు వెళ్లలేకపోవడంతో ఇల్లు పూర్తిగా దగ్ధం
  • నగరంలోని చాలా చోట్ల ఇదే పరిస్థితి..  
  • పర్మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్న అధికారులు
  • తర్వాత బిల్డింగ్స్​ వైపు చూడట్లే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: మణికొండ మున్సిపాలిటీలోని పుప్పాలగూడలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదం.. అధికారుల నిర్లక్ష్యాన్ని, అనుమతుల్లోని లోపాలను మరోసారి బయటపెట్టింది. హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న ఈ బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఓ ప్లాట్​పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఫైర్​సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ప్రమాదం జరిగిన చోటికి ఫైరింజన్​వెళ్లడానికి దారి లేకపోవడంతో పక్క అపార్ట్​మెంట్​లోకి వెళ్లి నీళ్లు కొట్టాల్సి వచ్చింది.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదాలు జరిగిన సమయంలోనే ఇటువంటివి తెరపైకి వస్తున్నాయి. ఆక్యూపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందిన తర్వాత బిల్డర్లు, యజమానులు వారికి నచ్చినట్లుగా నిర్మాణాలు చేసుకుంటున్నారు. దీంతో సహాయక చర్యలు కూడా అందించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపడితే ప్రమాదం జరిగిన సమయంలో అగ్నిమాక సిబ్బంది క్షణాల్లో మంటలను అదుపు చేసే అవకాశం ఉంటుంది. అయితే చాలా చోట్ల ఆ పరిస్థితి ఉండడం లేదు. 

అనుమతుల జారీ ఇలా....

భవన నిర్మాణాల అనుమతుల కోసం గ్రేటర్ లో అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అయితే 1000 చదరపు గజాల్లో 5 ఫ్లోర్ల వరకు స్థానిక మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వవచ్చు. 500 చదరపు గజాల లోపు అయితే నాలుగు ఫ్లోర్ల వరకు మాత్రమే నిర్మించుకోవాలి.  వెయ్యి చదరపు గజాలకు మించితే హెచ్ఎండీఏ అనుమతులు పొందాలి.

జీహెచ్ఎంసీ పరిధిలో అయితే  600 చదరపు గజాలు లేదా మూడు ఫ్లోర్ల భవన నిర్మాణాలకు సర్కిల్ స్థాయిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్, 600 నుంచి1200 చదరపు గజాల వరకు జోనల్ లెవెల్​ఆఫీసర్​అనుమతులు తీసుకోవాలి.1200 చదరపు గజాలు దాటితే
జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్​నుంచి అనుమతులు జారీ అవుతాయి. 

జరుగుతున్నది వేరే..

నగరంలో ఎవరైనా ఇండ్లు, అపార్ట్​మెంట్లు కట్టుకోదలిస్తే అన్ని అనుమతులు తీసుకుంటున్నారు. చివరకు ఆక్యూపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందుతున్నారు. ఆ తర్వాత వారికి ఇష్టమొచ్చినట్లుగా మార్పులు చేసుకుంటున్నారు. చుట్టూ ఫైర్ ఇంజిన్లు తిరిగేందుకు వదిలిన స్థలాల్లోనూ ఏదో ఒక నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు గార్డెన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని గోల్డెన్​ఓరియోల్ అపార్ట్​మెంట్​లోనూ ఇలాగే గార్డెనింగ్​ఏర్పాటు చేశారు.

దీంతో ప్రమాదం జరిగిన బ్లాక్ బి, 310 ప్లాట్ వద్దకు ఫైర్ ఇంజిన్లు వెళ్లలేకపోయాయి. ఓసీ జారీ అయిన తరువాత బిల్డర్లు, యజమానులు ఇష్టారీతన నిర్మాణాల్లో మార్పులు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక గ్రేటర్ పరిధిలోకి వస్తే కనీస అనుమతులు లేకుండా లక్షల్లో భవనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఫైర్ యాక్సిడెంట్లను పరిశీలిస్తే సగానికిపైగా అనుమతులు లేవని అధికారులు గుర్తించారు.

కొందరు అనుమతులు ఒకలా తీసుకొని, మరోలా నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలు మొదలు పెట్టిన నుంచి గృహప్రవేశాలు అయ్యేంత వరకు అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. అన్ని అనుమతులు వచ్చిన తరువాత మళ్లీ రీ కన్ స్ర్ట్ క్షన్స్ చేస్తుండటంతో ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇది కేవలం ఓనర్లు వారి స్వార్థం కోసం మాత్రమే చేస్తున్నారు. దీనివల్ల ఫ్లాట్లు కొన్నవారు ఇబ్బందులు పడుతున్నారు.