- రాజకీయ ఒత్తిళ్లతో ఏండ్లుగా ముందుకు పడని రహదారుల విస్తరణ
- రోడ్డు వెడల్పు కోసం ఎమ్మెల్యే కాటిపల్లి తన ఇంటిని కూల్చడంతో మళ్లీ తెరపైకి
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి టౌన్లో రోజురోజుకు జనాభా పెరుగుతున్నా అందుకనుగుణంగా రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం తదితర మౌలిక వసతులు కల్పించడం లేదు. టౌన్లో ఎప్పుడూ వెహికిల్స్రద్దీ ఉంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో పాటు నాలుగు జిల్లాలకు కూడలిగా ఉంది. దీంతో వివిధ పనులపై నిత్యం వచ్చిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఇరుకైన రోడ్లపై ప్రయాణం చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మాస్టర్ ప్లాన్‌లో చూపినట్లు రోడ్ల వెడల్పు చేయకపోవడం, ప్రస్తుతమున్న రోడ్లపై కూడా ముందుకొచ్చి నిర్మాణాలు చేపట్టారు. ప్రధాన చౌరస్తాల వద్ద ఇదే పరిస్థితి ఉంది. రోడ్డు వెడల్పు పనులకు అడ్డుగా ఉన్న తన ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూల్చేయడంతో ఈ టాపిక్మళ్లీ చర్చకు వచ్చింది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌నుంచి హౌజింగ్బోర్డ్వరకు (పాత హైవే)ఉన్న రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, సుభాష్‌రోడ్డు, స్టేషన్‌రోడ్డు, ఇందిరా చౌక్‌నుంచి పాత బస్టాండ్‌మీదుగా అశోక్‌నగర్ కాలనీ రైల్వే గేట్‌వరకు, నిజాంసాగర్ రోడ్డు నుంచి జన్మభూమి రోడ్డు, ఆర్కే లాడ్జి రోడ్డు, చర్చి నుంచి రైల్వే గేట్‌వరకు ఉన్న రోడ్డు ప్రధానమైనవి.
ఈ ఏరియాల్లోనే వ్యాపార సముదాయాలు కేంద్రీకృతమై ఉన్నాయి. వీటికి తోడు నిజాంసాగర్‌చౌరస్తా, ఇందిరా చౌక్, రామారెడ్డి రోడ్డు టర్నింగ్, కొత్త బస్టాండ్‌వద్ద జంక్షన్లు కీలకం. ఇందులో పలు రోడ్లను మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరించాలనే ప్రతిపాదన ఉన్నా, ఏండ్లుగా ముందడుగు పడడం లేదు. గతంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినా రాజకీయ ఒత్తిళ్లతో ఆగిపోయాయి. రోడ్లను విస్తరించకపోవడం, డ్రైనేజీలను నిర్మించకపోవడంతో వానాకాలంలో రోడ్లపైనే నీరు ప్రవహిస్తోంది. మెయిన్ రోడ్లపై పూట్పాత్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. రోడ్లు వెడల్పు చేయకుండానే డివైడర్లు నిర్మించారు. సెంట్రల్లైటింగ్ఏర్పాటు చేసి, డ్రైనేజీలను కుదించారు. దీంతో వెహికల్స్రద్దీ పెరిగి ఆయా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది.
పరిస్థితి ఇది..
టౌన్‌లోని సిరిసిల్ల రోడ్డు 100 ఫీట్లు ఉంటుంది. రోడ్డుపై చాలాచోట్ల ముందుకొచ్చి నిర్మాణాలు చేపట్టారు. ఈ రోడ్డును విస్తరించేందుకు 15 ఏండ్ల కిందే పనులు షురూ చేసి, మధ్యలో ఆపేశారు. పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ వైపు ఉన్న రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్లు. కానీ ప్రస్తుతం ఆ మేర రోడ్డు లేదు. 40 నుంచి 50 ఫీట్ల మధ్య ఉంది. ఎప్పుడు రద్దీగా ఉండే పాత బస్టాండ్ ఏరియాలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వెహికిల్స్ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నిజాంసాగర్రోడ్డులోని జీవదాన్ స్కూల్ కు ఎదురుగా ఉన్న జన్మభూమి రోడ్డు, ఆర్కే లాడ్జి రోడ్డు, అశోక్‌నగర్ కాలనీ రైల్వే గేట్ రోడ్డు 80 ఫీట్లుగా ఉంది. కానీ నిర్మాణాలు ముందుకొచ్చాయి. జన్మభూమి రోడ్డును 80 ఫీట్ల నుంచి 60 ఫీట్లకు కుదిస్తూ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ మార్గం గుండా నిత్యం వందలాది వెహికిల్స్ తిరుగుతాయి. ఆయా రోడ్లలో ప్రజాప్రతినిధులు, వారి సంబంధీకుల ఇండ్లు ఉన్నాయి. నిజాంసాగర్‌చౌరస్తా జంక్షన్ డెవలప్మెంట్ పనులు ఆగిపోయాయి. ఇక్కడా రోడ్డు వెడల్పు చేపట్టాల్సి ఉంది. రోడ్ల వెడల్పు పనులు ఏ మేర ముందుకెళ్తాయనేది స్థానికంగా ఆసక్తి నెలకొంది.