దేశభక్తికి నిలువుటద్దం నర్సయ్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో అఖిలభారత విద్యార్థి పరిషత్​ను స్థాపించిన వారిలో అగ్రగన్యులు, పరిషత్ కు వెన్నుముకగా ఆరు దశాబ్దాల పాటు పనిచేసిన వ్యక్తి, అధ్యాపకుడిగా వేలాదిమంది యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన గుజ్జుల నర్సయ్య ఇక లేరనే విషయం నమ్మశక్యంగా లేదు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా.. ‘నేనున్నాను’ అంటూ పరిష్కారం చూపే వ్యవహార కర్త, ప్రతి హృదిలో దేశభక్తిని నూరిపోసే సమాజ సేవకులైన ఆయన, సెప్టెంబర్​24న శివైక్యం చెందారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెంలో జన్మించిన నర్సయ్య సార్​ప్రాథమిక విద్యభ్యాసం మండెల గూడెం, ఖిలాశాపూర్ గ్రామాల్లో పూర్తి చేశారు. ఆలేరులో ఇంటర్ చదివి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసి, జూనియర్ కాలేజీ లెక్చరర్​గా ఉద్యోగంలో చేరారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్​గా పదోన్నతి పొంది, తెలంగాణలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేశారు. 

విద్యార్థి ఉద్యమాలలో..

తెలంగాణలో ఆరు దశాబ్దాలుగా అనేకమంది విద్యార్థులు, యువతకు నర్సయ్య సార్​స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆధ్యాత్మిక, విద్యార్థి ఉద్యమాలలో వీరి పాత్ర ఎనలేనిది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, పరివార్ సంస్థల కార్యకర్తలపై నక్సలైట్లు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసిన సందర్భాల్లో ఆయన బాధిత కుటుంబాల్లో మనోధైర్యం నింపుతూ ఉండేవారు. తన ఉపన్యాసాలతో విద్యార్థి, యువతలో చైతన్యం, స్ఫూర్తి, నర నరాన దేశభక్తిని పెంపొందించేవారు. తెలంగాణలో1970–2000 మధ్యకాలంలో కొంత సామాజిక స్పృహ ఉన్న విద్యార్థి ఎవరైనా నర్సయ్య సార్​ప్రసంగాన్ని వినే ఉంటారు. ప్రతి కాలేజీలో విద్యార్థుల స్వాగత సభలు, వీడ్కోలు కార్యక్రమాలు, కాలేజీల వార్షికోత్సవ సభల్లో ఆయన ప్రసంగం తప్పకుండా ఉండేది. తెలంగాణలో సామాజిక, కుటుంబ, ఆర్థిక సమస్యలు, ఇతర విభేదాల పరిష్కారం కోసం ఆయనను సంప్రదించేవారు. విద్యార్థి పరిషత్ ఉద్యమాలు నిర్వహించినా, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినా వాటిని జయప్రదం చేయడంలో నరసయ్య సార్ కీలకపాత్ర వహించేవారు. 

మార్గదర్శకులుగా..

1987–-1989 మధ్యకాలంలో రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా, విభాగ్ ప్రముఖ్ గా, సంభాగ్ ప్రముఖ్ గా, బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ పొందిన తర్వాత బీజేపీలో చేరి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీల్లో నర్సయ్య సార్​ శిష్యులు ఎందరో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది విద్యార్థులకు, యువతకు జ్ఞానం,శీలం, ఏకత బోధిస్తూ తుది శ్వాస వరకు సేవలందించిన నర్సయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ..!!

- కూరపాటి 
విజయ్ కుమార్