
- ఖర్గే, మీనాక్షికి నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి వినతి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం పెద్దలకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ హయాంలోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచానని తెలిపారు.
ఆ సమయంలో అధికార బీఆర్ఎస్ లో చేరాలని ఒత్తిడి వచ్చినా... కాంగ్రెస్ భావజాలం, రాహుల్ గాంధీపై నమ్మకంతో కాంగ్రెస్ లో చేరానని వివరించారు. అలా కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన తనకు మంత్రిపదవి ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను అధిష్టానం పెద్దలకు వివరించానని దొంతి మాధవరెడ్డి మీడియాకు తెలిపారు.