
- చైర్‍పర్సన్ , వైస్ చైర్మన్ పై సొంత పార్టీ లీడర్లే తిరుగుబాటు
- కౌన్సిల్ మీటింగ్‌కు 12 మంది డుమ్మా
- చైర్‍పర్సన్, వైస్ చైర్మన్లను మార్చాలని డిమాండ్
వరంగల్/నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లలో ముసలం పుట్టింది. చైర్మన్ గుంటి రజని, వైస్ చైర్మన్ మునగాల వెంకటరెడ్డి తీరుపై 12 మంది అధికార పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. గురువారం జరగాల్సిన కౌన్సిల్ మీటింగుకు డుమ్మా కొట్టి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌కు వెళ్లారు. తమకు ఫండ్స్ కేటాయించడంలో వివక్ష చూపడంతో గతంలో ఈ వివాదం మొదలైంది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటూ.. తమకు వాటా ఇవ్వడం లేదని తోటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు నారాజ్‌లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో ఎట్టిపరిస్థితుల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను మార్చాలని పట్టుబట్టారు. ఇందులో భాగంగానే తిరుగుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఎలక్షన్లకు ముందు పార్టీ కౌన్సిలర్ల తిరుగుబాటు ఎమ్మెల్యే సుదర్శన్‍రెడ్డికి తలనొప్పిగా మారింది.
18 మందిలో 12 మంది వ్యతిరేకం..
నర్సంపేట మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 18 మంది అధికార పార్టీకి చెందినవారు కాగా 6గురు కాంగ్రెస్ వారు ఉన్నారు. చైర్మన్ గుంటి రజనీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకటరెడ్డిపై కొంత కాలంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే మూడుసార్లు అంతర్గతంగా వీరి మధ్య రచ్చ జరిగింది. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద చైర్మన్, వైస్ చైర్మన్లు పెద్దఎత్తున డబ్బులు దండుకుంటున్నారన్నట్టు సమాచారంతో కౌన్సిలర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బును తోటి కౌన్సిలర్లకు పంచకపోవడంతోపాటు, మున్సిపల్ ఫండ్స్ కేటాయింపులో వివక్ష చూపుతున్నారని గుస్సా అవుతున్నారు. దీంతో గురువారం కౌన్సిల్ మీటింగ్ కు రాలేదు. కాంగ్రెస్‍కు చెందిన ఆరుగురు హాజరయినా కోరం లేకపోవడంతో కమిషనర్ మీటింగ్‍ను వాయిదా వేశారు.
కాంగ్రెస్ కౌన్సిలర్లు.. మీటింగ్ బైకాట్
అధికార పార్టీ కౌన్సిలర్లు ఓవైపు అసమ్మతితో ఉండగా.. ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు బైకాట్ చేశారు. ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల వార్డులకు డెవలప్‍మెంట్ ఫండ్స్.20 లక్షలు కేటాయించి.. తమకు రూ.10 లక్షలు మాత్రమే కేటాయించడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య ఇదే విషయమై కమిషనర్, చైర్మన్ గుంటి రజనీలను నిలదీశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు అంశం నర్సంపేటతో పాటు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం కావడం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డికి తలనొప్పిగా మారింది. హైదరాబాద్ వెళ్లిన అసమ్మతి కౌన్సిలర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎలక్షన్స్ ముందట ఇలా చేయడం సరికాదని.. అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుందాం రమ్మని కబురు పెట్టినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్లు వీరే.!
శీలం రాంబాబు, మినుముల రాజు, బోడ గోల్యానాయక్, గందె రజిత చంద్రమౌళి, నాగిశెట్టి ప్రసాద్, బానాల ఇందిర, జుర్రు రాజు, లునావతు కవిత, దేవోజు తిరుమల సదానందం, వేల్పుగొండ పద్మ రాజు, రామసహాయం సుధాకర్‌రెడ్డి, గంపు సునీత