- హై కమాండ్ నుంచి మదన్‌రెడ్డికి సంకేతాలు
- శిరసావహిస్తారా.ధిక్కరిస్తారా..
- హాట్‌టాపిక్‌గా నర్సాపూర్ టికెట్ వ్యవహారం
మెదక్, నర్సాపూర్, వెలుగు : నర్సాపూర్ అసెంబ్లీ బీఆర్ఎస్ టికెట్ విషయంలో అధిష్ఠానం మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు టికెట్ఖరారైందని అధికారికంగా ప్రకటించడమే మిగిలిఉందని సమాచారం. కాగా పార్టీ హై కమాండ్ తనకు టికెట్ ఇవ్వక పోవడంతో నారాజ్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. ఎక్కడ మీటింగ్ జరిగినా టికెట్ వదిలే ప్రసక్తే లేదంటున్నారు. తాను ప్రజల మనిషినని కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని భారీ మెజారిటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మదన్ రెడ్డి హై కమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తారా.. లేదా దిక్కరిస్తారా అన్నది పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్‌గా మారింది. అన్ని పార్టీల కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఆగస్టు 21న మెదక్ అసెంబ్లీ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి కేటాయించిన సీఎం కేసీఆర్ నర్సాపూర్ టిక్కెట్ ను మాత్రం ఎవరికీ కేటాయించలేదు. దీంతో నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాడర్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నర్సాపూర్ నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో దిగి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం వయోభారాన్నికారణంగా చూపి మదన్ రెడ్డిని పక్కన బెట్టి మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటోంది.
పిలవలేదు.. మాట్లాడలేదు..
నియోజకవర్గంలో పర్యటనల సందర్భంగా ఆయా చోట్ల జరిగే మీటింగ్‌లలో మాట్లాడుతున్న మదన్ రెడ్డి నర్సాపూర్ టిక్కెట్ వదిలే ప్రసక్తే లేదని ప్రజా బలం ఉన్న తనకే ఛాన్స్ వస్తుందని, కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీచేస్తానని చెబుతున్నారు. కానీ రోజులు గడుస్తున్నా నర్సాపూర్ టికెట్ విషయంలో పార్టీ అధిష్టానం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. మదన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ ఇప్పటి వరకు సీఎం నుంచి గాని, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నుంచి గాని ఆయనకు పిలుపు రాలేదు.
ఇతర జిల్లాల్లో సిట్టింగ్‌లకు కాకుండా ఇతర నాయకులకు టికెట్లు ఇచ్చిన చోట తీవ్ర అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలిపించి మాట్లాడి కార్పొరేషన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ నర్సాపూర్ విషయంలో మాత్రం టికెట్ ఇవ్వని మదన్ రెడ్డిని పిలిపించకపోవడం, మాట్లాడకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మదన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై అందరి దృష్టి నెలకొంది.