
కౌడిపల్లి, వెల్దుర్తి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా కేసీఆర్ అడ్డా అని, లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరు బరిలో ఉన్నా బీఆర్ఎస్కు తిరుగుండదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దుర్తిలో, ఆ తర్వాత కౌడిపల్లిలో జరిగిన కౌడిపల్లి, కొల్చారం, చిలప్‌చెడ్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్‌లో ఆమె లోక్‌సభ బీఆర్ఎస్అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారని, అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రఘునందన్ రావు మాయ మాటలు నమ్మని దుబ్బాక ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు బుట్ట దాఖలయ్యాయన్నారు.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో కలెక్టర్ గా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి మెరుగైన సేవలు అందించానన్నారు. దేశంలోనే ఒకే చోట కలెక్టర్ గా ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తి గా ఈ గడ్డ తనకు ఖ్యాతి ఇచ్చిందన్నారు. తనను పార్లమెంట్‌కు పంపిస్తే ఈ గడ్డను మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
సంగారెడ్డి (హత్నూర): మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. హత్నూర మండలం దౌల్తాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధాల హామీలతో గెలిచి ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేసీఆర్బలపరిచిన వెంకట్రామిరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింలు, దేవేందర్ రెడ్డి, చంద్ర గౌడ్, దామోదర్ రెడ్డి, శివశంకర్ రావు, శ్రీకాంత్, వీరేందర్ పాల్గొన్నారు.