
- వారం గడచినా నర్సాపూర్ క్యాండిడేట్‌ను కన్ఫామ్ చేయని కేసీఆర్
- టికెట్తనదే అనే ధీమాలో సునీతాలక్ష్మారెడ్డి
మెదక్/నర్సాపూర్, వెలుగు : ప్రజల మద్దతు నాకే ఉంది. నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా పార్టీ బీ ఫాం నాకే వస్తుంది. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముక్కలు కాకుండా చూడాలని పార్టీ హైకమాండ్‌ను కోరుతున్న. రాజ్యాంగబద్ధ పదవీ కాలం పూర్తి కాలేదు.. అంతకుమించి పెద్ద పదవి చేపట్టినా సరే.. ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుని డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న నాకు అభ్యంతరం లేదు...’ అని పార్టీతోపాటు సునీతాలక్ష్మారెడ్డిని ఉద్దేశించి నర్సాపూర్ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఇటీవల చేసిన ఈ వాఖ్యలు నియోజకవర్గ బీఆర్ఎస్ లో కాక రేపుతున్నాయి.
దీంతో మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బహిర్గతమైనట్లైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సునీతారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన మదన్ రెడ్డి గెలిచారు. అనంతరం సునీతారెడ్డి 2019లో టీఆర్ఎస్లో చేరారు. 2021లో సీఎం కేసీఆర్ ఆమెకు కేబినెట్ హోదాగల రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. ఇన్నాళ్లు నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పాల్గొన్నా.. అంతర్గతంగా ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా నడుస్తూ వచ్చింది.
పెండింగ్ అందుకేనా?
మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఉన్నప్పటికీ మళ్లీ నర్సాపూర్ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్ష సునీతారెడ్డిలో బలంగా ఉంది. ఈ మేరకు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరినప్పుడే ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న హామీ పార్టీ పెద్దల నుంచి లభించిందనే ప్రచారం ఉంది. ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో నర్సాపూర్ టికెట్పెండింగ్లో పెట్టడం ఇందుకు బలం చేకూర్చింది.
వారం గడిచినా ఎటూ తేలలే..
నర్సాపూర్ అసెంబ్లీ స్థానంలో టికెట్ ఎవరికి ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టిన కేసీఆర్ నాలుగు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. కానీ వారం గడిచినా ఇంకా ఎటూ తేల్చలేదు. కాగా టికెట్ తనకే వస్తుందన్న ధీమాలో సునీతారెడ్డి ఉన్నారు.
చిలుముల బల ప్రదర్శన..
టికెట్ మళ్లీ మదన్‌రెడ్డికే ఇవ్వాలంటూ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్, ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలివెళ్లి జిల్లా మంత్రి హరీశ్ రావు ఇంటి ముందు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే తన మద్దతు దారులతో నర్సాపూర్ లో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. నర్సాపూర్ సీటు వదులుకునే ప్రసక్తేలేదని ఆయన తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ తో తనకున్న అనుబంధం, సాన్నిహిత్యం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ బీ ఫామ్ కచ్చితంగా తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ఎవరికి వస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.