బీసీలకు కేసీఆర్ అన్యాయం చేస్తుండు

బీసీలకు కేసీఆర్ అన్యాయం చేస్తుండు

సంగారెడ్డి, వెలుగు: టీఆర్ఎస్‌‌‌‌లో ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను ఉరికించి కొట్టిన వారికే పదవులు ఇచ్చారన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన మాలాంటి వారిని పట్టించుకోకుండా టీఆర్ఎస్ అభ్యర్థులపై ఓడిపోయినోళ్లకు  పదవులిచ్చుడేంది? తెలంగాణ వస్తే ఉద్యమకారులకు గౌరవం లభిస్తుందని ఆశించిన బీసీ వర్గాలకు నిరాశే మిగిల్చారు. ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్ పదవులు మొత్తం ఉన్నత వర్గాలకే ఇచ్చారు. ఒక్కరు కూడా బలహీన వర్గాల వారు సీఎంకు కనిపించలేదా?” అని ఫైర్ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా వెనుకబడిందని, నర్సాపూర్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధీ జరగలేదని మురళి అన్నారు. ఉద్యమం టైం నుంచి పనిచేస్తున్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని కాదని సబితాఇంద్రారెడ్డి ఏం చేసిన్రని మంత్రి పదవి ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కనీసం జిల్లా పరిషత్ వైపు చూడలేదని విమర్శించారు. 

హరీశ్​ రావు పేరుకే మంత్రి 

హరీశ్‌‌‌‌రావు పేరుకే కేబినెట్ మంత్రి అని, ప్రభుత్వంలో ఆయన పెత్తనం ఏం నడుస్తలేదని మురళీయాదవ్ అన్నారు. ప్రగతి భవన్‌‌‌‌లో ఓ తొట్టి గ్యాంగ్ కూర్చొని రాష్ట్రంలో జరిగే పరిస్థితులు తెలుసుకోకుండా పదవులు పంచుతున్నారన్నారు.