హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై వెలుగుచూసిన డబుల్ మర్డర్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. యువతి, యువకుడు అత్యంత దారుణంగా హత్యకు గురికావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కొంత పురోగతి సాధించారు. మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించారు. మృతుడి బాడీకి 60 మీటర్ల దూరంలో యువతి మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. హత్యకు గురైన ఇద్దరు 25 నుండి 30 ఏండ్ల వయసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ | ఎన్నిసార్లు చెప్పిన మీరు మారరా..?: బైక్‌పై వెళ్తున్న గొంతు తెంపిన చైనా మాంజా
అంకిత్ సాకేత్ హైదరాబాద్ శివారులోని నానక్ రాం గూడ హనుమాన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటూ హౌజ్ కీపింగ్‌గా పని చేస్తున్నాడని పేర్కొన్నారు పోలీసులు. శనివారం (జనవరి 11) రాత్రి ఈ జంట హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు ఎవరన్నది తేలడంతో.. యువతి ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసలు వీరిద్దరి మధ్య సంబంధం ఏంటీ..? గుట్టపైకి ఎందుకు వచ్చారు..? ఎలా వచ్చారు..? వీరితో పాటు ఇంకా ఎవరైనా వచ్చారా లేక ఇద్దరే వచ్చారా..? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుతు తెలిపారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని చెప్పారు.