ఇలాంటి ఓ ఫ్రెండ్ ఉండాలనిపించేలా..

ఇలాంటి ఓ ఫ్రెండ్ ఉండాలనిపించేలా..

శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న లీడ్ రోల్స్‌‌‌‌లో రిషికేశ్వర్ యోగి రూపొందించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’.  టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ నెల 25న సినిమా విడుదల.  ఈ సందర్భంగా హీరోలు శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న మీడియాతో ముచ్చటించారు.  

శివకుమార్ మాట్లాడుతూ ‘ఇందులో సత్య అనే పాత్రలో నటించా.  డబ్బున్న కుటుంబంలో పుట్టి సకల సౌకర్యాలతో హాయిగా బ్రతికే యువకుడు.. అనుకోకుండా కేరళలోని తనకు తెలియని ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎలాంటి  పరిస్థితులను ఎదుర్కొన్నాడు.. తనకు ఎవరు తోడుగా నిలిచారు అనేది కథ.  సత్యమే శివం, శివపుత్రుడు తరహాలో ప్రేక్షకులను ఒక మంచి అనుభూతికి, ఎమోషన్‌‌‌‌కు గురిచేసే చిత్రమిది. ఇప్పటికే పలు ఫిలిం ఫెస్టివల్స్‌‌‌‌లో మా సినిమాకు దాదాపు అరవై అవార్డ్స్ వచ్చాయి.  ఈ చిత్రం నాకు హీరోగా మంచి పేరు తెస్తుంది’ అని చెప్పాడు.  

నితిన్ ప్రసన్న మాట్లాడుతూ ‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’లో విలన్‌‌‌‌గా నటించిన నేను ఇందులో అందుకు పూర్తి భిన్నమైన పాత్ర పోషించా.  మన జీవితంలోనూ ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని,  మనుషులు ఇలా ఉంటే మన సమాజం ఎంత బాగుంటుంది అనిపించేలా నా పాత్ర ఉంటుంది.  హ్యూమన్ ఎమోషన్స్ నేపథ్యంలో దర్శకుడు హార్ట్ టచింగ్‌‌‌‌గా తెరకెక్కించాడు.  ఒక నటుడు అన్ని రకాల ఎమోషన్స్‌‌‌‌ను లైఫ్‌‌‌‌లో చూసుండాలి. అప్పుడే గొప్ప నటుడిగా ఎదుగుతాడు అనే అంశాన్ని ఈ కథలోని లీడ్ రోల్ ద్వారా చూపించాం’ అని చెప్పాడు.