
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ‘ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్’ ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ సెక్టార్లో చరిత్ర సృష్టించింది. ‘బ్లూ ఘోస్ట్’ అనే ల్యాండర్‌ను చంద్రుడిపై సేఫ్ గా దించింది. ‘‘మనం ఇప్పుడు చంద్రుడిపై ఉన్నాం. ల్యాండర్ సేఫ్‌గా నిటారుగా దిగింది’’ అని ఫైర్‌ఫ్లైకు చెందిన మిషన్ కంట్రోల్.. టెక్సాస్ ఆస్టిన్లోని ఇంజినీర్ టీమ్‌కు ఆడియో మెసేజ్ పంపింది. చంద్రుడిపై కూలిపోకుండా, ఒక సైడ్ కు ఒరిగిపోకుండా.. నిటారుగా స్పేస్ షిప్‌ను ల్యాండ్ చేసిన రెండో ప్రైవేటు స్పేస్ ఏజెన్సీగా ‘ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్’ నిలిచింది.
జనవరి 15న ఫ్లోరిడా మెరిట్ ఐలాండ్స్‌లోని కెన్నడీ స్పేస్ సెంటర్(నాసా) నుంచి స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్.. నింగిలోకి దూసుకెళ్లింది. బ్లూ ఘోస్ట్ ల్యాండర్ పొడవు హిప్పో పొటమస్(2 మీటర్లు) అంత ఉంటుందని ‘ఫైర్ ఫ్లై ఏరోస్పేస్’ ప్రకటించింది. స్పేస్ షిప్.. దాదాపు ఒక నెల పాటు భూమి చుట్టూ తిరిగింది. ఆ తర్వాత 16 రోజులు చంద్రుడి కక్ష్యలో ఉంది. అక్కడి నుంచి ఆటో పైలట్ మోడ్‌లో కిందికి ప్రయాణిస్తూ.. చంద్రుడి నార్త్ ఈస్టర్న్ సైడ్‌లో ఉన్న మోన్స్ లాట్రెయిల్ దగ్గర్లో ‘బ్లూ ఘోస్ట్’ ల్యాండ్ అయింది.
చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు 10 పరికరాలను బ్లూ ఘోస్ట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. వాటిలో లూనార్ సాయిల్ ఎనలైజర్, రేడియేషన్ తట్టుకునే కంప్యూటర్, గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఉన్నాయి. చంద్రుడిపై ఉన్న ధూళిని సేకరించేందుకు వాక్యూమ్ కూడా ఉన్నది. చంద్రుడి నేల లోపల ఉష్ణోగ్రతలు కొలిచేందుకు, డ్రిల్లింగ్ చేయడం, ఆస్ట్రోనాట్ల స్పేస్‌సూట్‌లు, పరికరాలకు అంటుకునే హానికరమైన దుమ్మును తొలగించే మరో పరికరాన్ని పరీక్షించడం వంటి పరికరాలను బ్లూ ఘోస్ట్ తనతో తీసుకెళ్లింది.
నాసాకు చెందిన 10 మంది సైంటిస్టులు ఈ ప్రాజెక్ట్ కోసం ‘ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్’ ప్రైవేట్ ఏజెన్సీతో కలిసి పనిచేశారు. ల్యాండర్‌కు అమర్చిన కెమెరా కొన్ని ఫొటోలు తీసి భూమికి పంపింది. ఫొటోల్లో బంగారు రంగులో మెరిసిపోతున్న స్పేస్‌క్రాఫ్ట్ బయటి భాగం, మరి కొంత చంద్రుడి ఉపరితలం కనిపిస్తున్నది. ల్యాండ్ అయినప్పుడు లేచిన దుమ్మూ కూడా రికార్డయింది.