9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోతే.. సునీతా విలియమ్స్కు ఇచ్చే.. అదనపు జీతం మరీ ఇంత తక్కువనా..?

9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోతే.. సునీతా విలియమ్స్కు ఇచ్చే.. అదనపు జీతం మరీ ఇంత తక్కువనా..?

ఎనిమిది రోజుల మిషన్ కోసమని అంతరిక్షానికి వెళ్లిన భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికన్ ఆస్ట్రోనాట్ బ్యారీ విల్ మోర్​ 9 నెలల తర్వాత భూమి మీద అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో 9 నెలలు అదనంగా ఉన్నందుకు ఈ ఇద్దరికీ అదనపు వేతనంగా నాసా ఎంత చెల్లిస్తుందనే ఆసక్తికర చర్చ మొదలైంది. విలియమ్స్, విల్ మోర్ నాసాలో జీఎస్–15 కేటగిరీ ఫెడరల్ ఎంప్లాయిస్.

ఈ ఇద్దరి జీతం సంవత్సరానికి సుమారు కోటీ 8 వేల నుంచి కోటీ 41 లక్షల వరకూ ఉంటుంది. ఈ లెక్కన.. ఈ తొమ్మిది నెలలు ఐఎస్ఎస్లో ఉన్నందుకు నాసా ఈ ఇద్దరికీ 81 లక్షల నుంచి కోటీ 5 లక్షల దాకా చెల్లించాలి. సునీతా విలియమ్స్కు, విల్ మోర్కు మంచి అమౌంటే ముడుతుందిగా.. ఇంకేం అని.. అనుకుంటే పొరపాటే. వాస్తవానికి నాసా షెడ్యూల్ ప్రకారం.. ఈ మిషన్ వ్యవధి ఎనిమిది రోజులే. కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలుగా సునీతా విలియమ్స్, విల్ మోర్ అక్కడే చిక్కుకుపోయారు.

ఓవర్ టైం ఉన్నందుకు నాసా అదనంగా ఏం చెల్లించకపోగా రోజుకు 4 డాలర్లు మాత్రమే ఈ తొమ్మిది నెలల కాలానికి సునీతా విలియమ్స్, విల్ మోర్కు చెల్లించనుంది. అంటే.. రోజుకు కేవలం 347 రూపాయలు మాత్రమే. ఈ విషయాన్ని స్వయంగా నాసా రిటైర్డ్ ఆస్ట్రోనాట్ క్యాడీ కొల్మెన్ చెప్పారు. సునీతా విలియమ్స్, విల్ మోర్ 8 రోజులకు బదులుగా ఉన్న ఈ 287 రోజుల కాలానికి వారికి దక్కేది కేవలం 1,148 డాలర్లు మాత్రమే. మన కరెన్సీలో 99 వేల 816 రూపాయలు. లక్ష రూపాయలు కూడా ఈ ఇద్దరూ పొందలేని పరిస్థితి. ఈ ఇద్దరూ భూమిపైకి వచ్చాక ఒక డిన్నర్ పార్టీ ఇచ్చినా ఈ లక్ష రూపాయలు హాంఫట్ అయిపోతాయి. ఇదీ సంగతి.

ALSO READ | ఐఎస్ఎస్కు చేరిన స్పేస్ ఎక్స్ క్రూ -10 మిషన్

జూన్ 5, 2024న అమెరికన్ ఆస్ట్రోనాట్ బ్యారీ విల్ మోర్తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లిన సునీతా విలియమ్స్.. జూన్ 14, 2024న తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా ఆమె, విల్ మోర్ అక్కడే చిక్కుకుపోయారు.

ఇంతకూ ఏం జరిగింది?
అంతరిక్షానికి ఆస్ట్రోనాట్లను తీసుకెళ్లేందుకు బోయింగ్ కంపెనీ తయారుచేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు జూన్ 5, 2024న నాసా మిషన్ చేపట్టింది. ఇందులో మిషన్ కమాండర్గా బ్యారీ విల్ మోర్, పైలట్గా సునీతా విలియమ్స్ స్పేస్కు వెళ్లారు. మిషన్ ప్రారంభానికి ముందు కూడా సాంకేతిక సమస్యలతో ఈ ప్రయోగం పలుమార్లు వాయిదా పడింది. చివరకు జూన్ 5, 2024న మిషన్ స్టార్ట్ అయింది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ను అట్లాస్ రాకెట్ విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది.

స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. కానీ స్టార్ లైనర్లో ఉన్న 28 థ్రస్టర్లలో 5 థ్రస్టర్లు ఫెయిల్ కావడం, హీలియం గ్యాస్ లీక్ అవుతుండటంతో జూన్ 14 చేపట్టాల్సిన రీఎంట్రీ మిషన్ వాయిదా పడింది. 9 నెలలు సునీతా విలియమ్స్, విల్ మోర్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మార్చి 16, 2025న ఉదయం 9 గంటల 37 నిమిషాలకు నాసా స్పేస్ ఎక్స్  క్రూ 10 మిషన్ విజయవంతంగా ఐఎస్ఎస్తో అనుసంధానం కావడంతో సునీతా విలియమ్స్, బ్యారీ విల్ మోర్ భూమి మీదకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.