కొత్త రకం వెంటిలేటర్.. 37 రోజుల్లో రెడీ

కొత్త రకం వెంటిలేటర్.. 37 రోజుల్లో  రెడీ
  • రూపొందించిన నాసా సైంటిస్టులు

న్యూయార్క్: కరోనాపై పోరాటానికి సాయంగా కొత్త రకం ప్రొటోటైప్ హై ప్రెజర్ వెంటిలేటర్ ను నాసా సైంటిస్టులు అభివృద్ధి చేశారు. నాసాలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్ ) లో కేవలం 37 రోజుల్లోనే ‘వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ యాక్సెసెబుల్ లోకల్లీ(VITAL) ప్రోటోటైప్’ ను తయారు చేసినట్లు ప్రకటించింది. న్యూయార్క్ లోని మౌంట్ సినాయ్ హాస్పిటల్‌లో ఈ వెంటిలేటర్ ను సక్సెస్​ఫుల్ గా పరీక్షించినట్లు వెల్లడించింది. దీని డిజైన్ ను కూడా ఈజీగా మార్చుకుని ఫీల్డ్ హాస్పిటల్స్ లో ఉపయోగించవచ్చని నాసా ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. జేపీఎల్​ను నిర్వహించే కాల్టెక్‌లోని ఆఫీస్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అండ్ కార్పొరేట్ పార్ట్‌నర్‌షిప్‌లు వెంటిలేటర్ కు ఉచిత లైసెన్స్‌ను అందిస్తాయని తెలిపారు.
ఇప్పటికే కరోనా తీవ్రస్థాయిలో ఉన్న పేషెంట్లకు ఐసీయూలో హై డైనమిక్ వెంటిలేటర్లు ఉపయోగిస్తున్నారు. వైరస్ వ్యాప్తి సమయంలో తేలికపాటి వైరస్ ప్రభావం పడిన వారికి తాము రూపొందించిన వెంటిలేటర్ ను ఉపయోగించవచ్చని, తద్వారా వారి కండిషన్ సీరియస్ అయ్యే పరిస్థితిని తగ్గించవచ్చని నాసా హెల్త్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ జేడీ పోల్క్ చెప్తున్నారు. ఈ వెంటిలేటర్ ను చాలా సులభంగా తయారు చేయవచ్చునని, ఫుడ్​ అండ్ డ్రగ్ అథారిటీ అనుమతి తర్వాత అందుబాటులోకి తెస్తామని అన్నారు.