- ఆ గ్రహంపైన నీళ్లు, వాతావరణం ఉండొచ్చు!
- 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు గుర్తింపు
వాషింగ్టన్: భూగోళం మాదిరిగా మనకు నివాసయోగ్యమైన గ్రహం ఇంకోటి ఈ అనంత విశ్వంలో ఎక్కడైనా ఉందా? అనేది తెలుసుకునేందుకు దశాబ్దాలుగా సైంటిస్టులు అంతరిక్షంపై ఫోకస్ పెడుతూనే ఉన్నారు. తాజాగా అచ్చం భూమిలాగే ఉన్న మరో సూపర్ ఎర్త్ ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైంటిస్టులు కనుగొన్నారు. మనకు 137 కాంతి సంవత్సరాల దూరంలోని ఒక ‘అరుణ మరుగుజ్జు (రెడ్ డ్వార్ఫ్)’ నక్షత్రం చుట్టూ ఒక సూపర్ ఎర్త్ తిరుగుతోందని గుర్తించారు. ‘టీఓఐ71బీ’ అనే ఆ గ్రహం మన భూమి కన్నా ఒకటిన్నర రెట్లు పెద్దగా ఉందట. మన సూర్యుడు కాకుండా విశ్వంలోని ఇతర నక్షత్ర వ్యవస్థల్లో మన భూమి కన్నా పెద్దగా.. నెప్ట్యూన్, యురెనెస్ కన్నా చిన్నగా ఉండే గ్రహాలను సూపర్ ఎర్త్ అని పిలుస్తుంటారు.
తాజా సూపర్ ఎర్త్ ను ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్(టెస్) ద్వారా గుర్తించామని నాసా వెల్లడించింది. మన సూర్యుడి కన్నా చిన్నగా, చల్లగా ఉండే నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతున్నట్లు తెలిపింది. భూమి మాదిరిగానే ఇది కూడా తన నక్షత్రం చుట్టూ జీవుల నివాసానికి అనుకూలమైనంత దూరం(హ్యాబిటేబుల్ జోన్)లోనే తిరుగుతోందని పేర్కొంది. ఈ సూపర్ ఎర్త్ కేవలం 19 రోజులకే ఒకసారి తన నక్షత్రాన్ని చుట్టి వస్తోందట. అంటే.. దీనిపై 19 రోజులకే ఒక ఏడాది గడిచిపోతుందట. అయితే, దీనిపై నీళ్లు, వాతావరణం ఉండే అవకాశం ఉందని మాత్రమే ప్రస్తుతానికి అంచనాకు వచ్చామని, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో దీనిపై మరింత స్టడీ చేస్తేనే ఇంకా కచ్చితమైన వివరాలు తెలుస్తాయని నాసా సైంటిస్టులు వెల్లడించారు. అంతేకాకుండా.. ఈ గ్రహంతోపాటు భూమికన్నా కొంచెం పెద్దగా ఉన్న మరో గ్రహం కూడా ఆ రెడ్ డ్వార్ఫ్ చుట్టూ తిరుగుతోందని కూడా తాము గుర్తించామని, దానిపైనా మరింత స్టడీ చేయాల్సి ఉందన్నారు.