ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేయచ్చు.. రూ. 17 లక్షలు గెలిచే అవకాశం

సృజనాత్మక ఆలోచనాపరులకు నాసా(NASA) శుభవార్త చెప్పింది. చంద్రునిపై చిక్కుకుపోయిన వ్యోమగాముల ప్రాణాలు రక్షించే వ్యవస్థను రూపొందించడంలో తమకు సహాయం చేయాలని కోరుతోంది. అలా అని ఊరికే మీ ఆలోచనలు పంచుకోనక్కర్లేదు. 20,000 అమెరికన్ డాలర్ల వరకు రివార్డ్‌ అందజేస్తారు. అంటే భారత కరెన్సీలో అక్షరాలా.. దాదాపు రూ.17 లక్షలు.

మీరు చేయాల్సిందల్లా చంద్రునిపై ఉండే కఠిన పరిస్థులను తట్టుకునేలా స్పేస్‌సూట్‌ రూపొందించడంలో సహాయం చేయడమే.  వ్యోమగామిని సురక్షితంగా రవాణా చేయగల అత్యుత్తమ డిజైన్‌లో మీరు పాలు పంచుకోవాలి. బరువు, స్పేస్‌సూట్‌ రక్షణ, వ్యోమగామి భద్రత వంటి అంశాలపై NASA నిపుణుల బృందం ఎప్పటికప్పుడు ఎంట్రీలను మూల్యాంకనం చేస్తుంది. ఒకేవేళ  వ్యోమగామి చంద్రుని ఉపరితలంపై గాయపడితే 2 కి.మీ వరకు సురక్షితంగా రవాణా చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. 

ఆ ఆలోచన మీకుంటే.. మీరు గెలిచినట్టే! మీ ఆలోచనలు పనుకోవడానికి జనవరి 23, 2025 వరకు సమయముంది. మీ ఆలోచనలను HeroX వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు. మరింత సమాచారం కోసం మీరు నాసా అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.

నాసా ఆర్టెమిస్ ప్రయోగం

నాసా 2026 చివరలో ఆర్టెమిస్ మిషన్ చేపట్టనుంది. చంద్రుని దక్షిణ ధృవాన్ని అన్వేషించే ప్రయోగమిది. ఈ ప్రాంతం నీరు-మంచు వంటి వనరులకు కీలకమైనది. అయితే ఆ ఉపరితలంపై కఠిన సవాళ్లు ఎదురువవుతున్నాయి. చంద్రునిపై ఉష్ణోగ్రతలు -203°C నుండి 54°C వరకు ఉంటాయి. తక్కువ గురుత్వాకర్షణ, రాళ్ళు,క్రేటర్‌లతో నిండిన ప్రమాదకర భూభాగమది. అన్వేషణ సమయంలో వ్యోమగామి గాయపడితే, వారు తమ స్థావరానికి దూరంగా ఇరుక్కుపోతారు. అలాంటి పరిస్థితలలో వారిని తిరిగి సురక్షితంగా చేర్చడమనేది ఒక పెద్ద సమస్య. అందువల్లే, నాసా మీ సహాయాన్ని కోరుతోంది.