చంద్రుని ఉపరితలంపై ఓ బిలానికి సంబంధించిన తాజా ఫొటోలను NASA విడుదల చేసింది. ఇవి నాసా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్(LRO) చంద్రుని ఉపరిత లంపై తీసిన ఫొటోలు. అయితే ఈ ఫొటోలకు ప్రాముఖ్యత ఉందని నాసా ప్రకటించింది. అదేంటంటే.. ఈ క్రేటర్ రష్యా కు చెందిన లూనా 25 క్రాష్ అయిన ప్రదేశమని భావిస్తోంది. 2023, ఆగస్టు 21 న లూనా25 క్రాష్ చవిచూసిన విషయం తెలిసిందే. ఈ స్పేష్ క్రాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో అర్థంతరంగా తన ప్రయాణాన్ని ముగించింది.
నాసా కు చెందని లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO).. లూనా 25 క్రాష్ అవకముందు ఇదే ప్రాంతంలో కొన్ని ఫొటోలను సేకరించింది. లూనా 25 క్రాష్ తర్వాత ఇటీవల చంద్రునిపై అదే ప్రాంతంలో ఓ బిలం ఉన్నట్లు కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇవి లూనా 25 క్రాష్ ప్రభావం ఫలితంగా ఏర్పడినట్లు నాసా భావిస్తోంది. ఈ ఫొటోల్లో కనిపించే బిలం సహజంగా ఏర్పడింది అనే దానికంటే.. లూనా 25 క్రాస్ ప్రభావ ఫలితమే అని నాసా ఎక్కువగా నమ్ముతోంది.
Luna-25 క్రాష్ అయిన తర్వాత రష్యా అంతరిక్ష సంస్థ Roscosmos ఆగష్టు 21న ప్రభావ స్థానాన్ని అంచనా వేసింది. క్రాష్ సైట్‌ను అన్వేషించడానికి NASA LRO కెమెరా (LROC) బృందం, మిషన్ ఆపరేషన్స్ బృందం మధ్య సహకార కార్యక్రమం ప్రారంభించబడింది. NASA ప్రకారం.. క్రాష్ సైట్ చిత్రాలు ఆగస్టు 24 న LRO అంతరిక్ష నౌక ద్వారా సేకరించారు.. సంఘటనకు ముందు , తరువాత తీసిన చిత్రాలను పోల్చి చూస్తే అక్కడ ఓ బిలం (గుంత) ఏర్పడినట్లు నాసా గుర్తించింది. చంద్రునిపై కొత్త బిలం సుమారు 10 మీటర్ల వ్యాసంతో 57.865 డిగ్రీల దక్షిణ అక్షాంశం , 61.360 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉందని నాసా తెలిపింది.