54 ఏళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సోమవారం ఏప్రిల్ 8న సంపూర్ణ.. సుదీర్ఘ సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో మెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సంపూర్ణ సూర్యగ్రహణం చీకట్లను ఫొటోలు తీసేందుకు మూడు రాకెట్లను నింగిలోకి పంపబోతున్నది. వాటి సహాయంతో గ్రహణ సమయంలో భూమి వాతావరణం పైపొరల్లో ఏర్పడే మార్పులను పరిశీలించేందుకు నాసా ప్రయోగం చేపట్టనుంది.
సూర్య గ్రహణం సమయంలో సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు పూర్తిగా అడ్డువస్తాడు. దాంతో భూమిపై చీకటి ఆవర్తిస్తుంది. ఈ సమయంలోనే నాసా మూడు రాకెట్లను పంపిస్తున్నది. అందులో ఒకటి అమెరికా నుంచి ప్రయోగిస్తుండగా.. మిగతా రెండింటి కెనడా, మెక్సికోల నుంచి ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
సాధారణంగా భూమి తిరుగుతున్న కొద్దీ సూర్యుని కిరణాలు కొద్దికొద్దిగా ప్రసరిస్తూ.. మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరతాయి. సాయంత్రానికి సూర్య కిరణాలు తగ్గుతాయి. అయితే, తీక్షణంగా సూర్య కిరణాలు ప్రసరిస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి సూర్యరశ్మి భూమిపై పడడం హఠాత్తుగా ఆగిపోతే ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకునేందుకు నాసా ఈ ప్రయోగానికి సిద్ధమైంది.
సూర్య కిరణాల్లోని రేడియేషన్‌ని భూ వాతావరణం అడ్డుకుంటుంది. ఈ సమయంలో భూమిపై ఉన్న వాయువులు రేడియేషన్‌కు గురై, వేడెక్కి వాటిలోని ఎలక్ట్రాన్స్ విడిపోవడంతో... వాతావరణం పైపొర విద్యుత్ ఆవేశితంగా మారుతుంది. భూమి మరోవైపునకు తిరిగినప్పుడు ఆ ప్రాంతంలో సూర్య కిరణాలు నిలిచిపోయి... వాతావరణం పైపొర తిరిగి సాధారణ స్థితికి చేరుతుంది. అయితే, ఇది క్రమంగా సాగుతూ వస్తుంటుంది. దాంతో పరిశోధన చేపట్టడం కష్టతరం. అలాగే, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఏయే అంశాలు ప్రభావితం చేయనున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో సూర్యగ్రహణం రోజున ఈ పరిశోధన చేపట్టాలని నిర్ణయించుకున్నది. సూర్య గ్రహణం సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాతావరణంలో రేడియేషన్ ప్రవేశం, ఇతర మార్పులు జరుగుతుంటాయి. దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధన చేపట్టేందుకు నాసా తాజా ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
రాకెట్లలో ప్రత్యేకంగా పలు పేలోడ్స్‌ను అమర్చింది. ప్రయోగం అనంతరం ఆయా పేలోడ్స్ వెంటనే సమాచారాన్ని సేకరించి.. నాసాకు చేరవేయనున్నాయి. ఈ సౌండింగ్ రాకెట్లు భూ ఉపరితలం నుంచి 420 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి.. తిరిగి నేలపైకి చేరుతాయి. మొదటి రాకెట్‌ను గ్రహణం ప్రారంభం కావడానికి 45 నిమిషాల ముందు, రెండో రాకెట్‌ను గ్రహణం ఏర్పడిన సమయంలో, మూడో రాకెట్‌ను గ్రహణం ఏర్పడిన 45 నిమిషాల తర్వాత ప్రయోగిస్తారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రయోగాలన్నీ గతంలో గ్రహణ సమయంలో చేపట్టిన ప్రయోగాలు, అధ్యయనాలతోనే కొనసాగుతోంది. ఈ ప్రయోగం విషయంలో ఇప్పటికే పలు కీలక ఆవిష్కరణలు జరిగాయి.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతాన్ని 1999 మే 19న ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో తీసిన చిత్రం సహాయంతో ఆర్థర్ ఎడ్డింగ్‌టన్ నిరూపించారు. 1868లో సూర్య గ్రహణాన్ని రికార్డు చేస్తున్న సమయంలోనే హీలియం మూలకాన్ని గుర్తించారు. చంద్ర గ్రహణ సమయంలో భూమిపై ఏర్పడిన నీడ ఆధారంగా చేసుకుని భూమి బల్లపరుపుగా లేదని, గుండ్రంగా ఉందని అరిస్టాటిల్ నిరూపించారు.